గజినీ మావయ్యకి ఏదీ గుర్తుండటం లేదు!

Jagan Mohan Reddy Reaction on YSRCP Leaders Arrest

మాజీ ఇంటలిజన్స్ చీఫ్ ఆంజనేయులుని పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని వైసీపీ అధినేత జగన్‌ తప్పు పట్టారు. అలాగే వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ పేరుతో వేధిస్తున్నారని జగన్‌ ఆరోపించారు.

ఎంపీ, ఐఏఎస్, ఐపీస్ అధికారులను ఇంతగా వేధించడం చరిత్రలో తానెప్పుడూ చూడలేదని జగన్‌ అన్నారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తున్నందునే తమ పార్టీ నేతలని, ఐఏఎస్, ఐపీస్ అధికారులను సిఎం చంద్రబాబు నాయుడు వేధిస్తున్నారని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు సృష్టించి వేధిస్తూ రాష్ట్రంలో ఓ భయానక వాతావరణం నెలకొల్పారని, తద్వారా రాష్ట్రంలో ఎవరూ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని జగన్‌ అన్నారు.

కేవలం 10 నెలల్లోనే రాష్ట్రంలో వ్యవస్థలన్నీటినీ సిఎం చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించేశారని జగన్‌ ఆక్షేపించారు.

ప్రాజెక్టులపై తాను ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం తొలగించేసి ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచేస్తూ కూటమి నేతలందరూ కలిసి దోచేసుకుంటున్నారని జగన్‌ ఆరోపించారు.

గజినీ సినిమాలో హీరో మెమొరీ లాస్ సమస్యతో బాధపడేవాడు. జగన్‌ చేసిన ఈ విమర్శలు విన్నప్పుడు ఆయనకి కూడా మెమొరీ లాస్ సమస్య ఉన్నట్లనిపిస్తుంది.

జగన్‌ అధికారంలోకి రాగానే సీనియర్ ఐపీస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావుపై అక్రమ కేసు నమోదు చేసి ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసి పదవీ విరమణ రోజు వరకు ముప్పతిప్పలు పెట్టిన విషయం అప్పుడే మరిచిపోయారు.

రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని ఎంతగా వేధించారంటే, ఆయన రాష్ట్రం వదిలి హైదరాబాద్‌ పారిపోయి అక్కడి నుంచే విధులు నిర్వహించారు.

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరికాళ్ళు వాచిపోయేలా కొట్టించడంతో ఆయన భయంతో ఢిల్లీ పారిపోయి ఎన్నికల వరకు రాష్ట్రానికి తిరిగి రాలేదు.

కరోనా సమయంలో గ్లౌజులు, మాస్కులు వంటివి కూడా జగన్‌ ప్రభుత్వం సమకూర్చలేకపోతోందని డాక్టర్ సుధాకర్‌ విమర్శించినందుకు ఆయనని వేటాడి వేధించి, పోలీసుల చేత నడిరోడ్డుపై బట్టలూడదీయించి, చేతులు వెనక్కు విరిచికట్టి అరెస్ట్‌ చేయించిన సంగతి జగన్‌ మారిచిపోయారేమో కానీ ప్రజలు మరిచిపోలేదు. రోగులకు వైద్యం చేసే డా.సుధాకర్‌పై మానసికరోగి అనే ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్లో పెట్టించడం, ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన క్రుంగిపోయి ఆత్మహత్య చేసుకున్న సంగతి జగన్‌ మరిచిపోయారు.

మాజీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు కూడా జగన్‌ ప్రభుత్వ వేధింపులు భరించలేకఆత్మహత్య చేసుకున్నారు కదా? వివేకానంద రెడ్డి గుండెపోటు-గొడ్డలిపోటుగా మారిన సంగతి ఎవరూ మరిచిపోలేరు.

సొంత చెల్లి వైఎస్ షర్మిల ఆంధ్రా వదిలి తెలంగాణలో రాజకీయాలు ఎందుకు చేసుకోవలసి వచ్చింది? తల్లి విజయమ్మని వైసీపీ నుంచి ఎందుకు బయటకు సాగనంపారు? వారిద్దరినీ ఆస్తుల కోసం కోర్టుకు ఎవరు ఈడ్చారు? వీర విధేయ విజయసాయి రెడ్డి ఎందుకు వైసీపీని వదిలేశారు? ఇప్పుడు ఆయనే జగన్‌కు పక్కలో బల్లెంలా ఎందుకు మారారు?అమరావతి రైతులపై దాడులు చేయించిందెవరు?

ఇలా చెప్పుకుంటూపోతే ఒకటా రెండా.. జగన్‌ 5 ఏళ్ళ పాలనలో అంతా ఆరాచకమే కదా?గజినీలా చేసిన నిర్వాకాలన్నీ మరిచిపోయి ఇప్పుడు సాధూ మహరాజ్‌లా మాట్లాడితే ప్రజలు నవ్వరా?

ADVERTISEMENT
Latest Stories