ఇన్నాళ్లుగా రహస్య మిత్రులుగా కొనసాగుతూ అవసరం వచ్చినప్పుడల్లా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ, ఒకరికి ఒకరు విభేదించుకుంటూ ఆయా రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ రాజకీయాలు చేసిన కేసీఆర్, జగన్ ల రహస్య బంధాన్ని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం బట్టబయలు చేసింది.
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన అతి కొద్దీ రోజులకే హైద్రాబాద్ లో ఉన్న కొన్ని వేల కోట్ల ఏపీ ఆస్తులను ఒకేఒక్క సంతకంతో తెలంగాణ ప్రభుత్వానికి దారాదత్తం చేసి దానికి ప్రతిగా కేసీఆర్ ఇంట విందు భోజనం చేసి వచ్చారు జగన్. అంటే జగన్ గారి విందు భోజనం ఖరీదు కొన్ని కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా జగన్ చేసిన వేల కోట్ల విలువైన సంతకం.
Also Read – హింసలోనే క్రెజ్ వెతుకుతున్న ప్రేక్షకులు, దర్శకులు…!
అయితే ఇదే రీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏపీ రాష్ట్రానికి వచ్చి రోజా గారి రొయ్యల పులుసు తిని, ఏపీ ప్రభుత్వానికి మన ప్రాజెక్టుల మీద అలుసిచ్చారు అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా గత కేసీఆర్ ప్రభుత్వం పులుసు తీశారు. అయితే ఈరోజు కృష్ణా నదీజలాల మీద చర్చ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి జగన్ భుజం మీద విమర్శలు అనే గన్ను పెట్టి కేసీఆర్ ను టార్గెట్ చేసింది.
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ – జగన్ లు ఇద్దరు ఏకాంతంగా గంటల తరపడి చర్చలు జరిపి, బిర్యానీలు తిని, స్నేహ పూర్వక సంబంధాలను కలిగి ఉండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాల వాటాను ఏపీ ప్రభుత్వానికి అప్పగించి ఈ రాష్ట్రప్రజలకు కేసీఆర్ అన్యాయం చేసారంటూ అసెంబ్లీ లో జగన్ వీడియోలను ప్లే చేసారు తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి.
Also Read – నారదుడుకి తక్కువేమీ కాదు.. మన వర్మ
ఏపీ శాసనసభలో కేసీఆర్ ను ఆకాశానికెత్తుతూ జగన్ చేసిన ప్రసంగాన్ని బిఆర్ఎస్ నాయకులకు అర్థమయ్యేలా కళ్ళముందు ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ ఎన్నికల సమయంలో ఏపీ పోలీసులతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ ప్రభుత్వం చేసిన రచ్చ, ఎన్నికల సమయం ముగియగానే తోకముడిచిన వైసీపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు కాంగ్రెస్ నాయకులు. మరి పక్క రాష్ట్ర ప్రభుత్వం తమ నాయకుడి పై ఇటువంటి విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు మోనంగా ఎందుకు ఉండిపోయారో..?
తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో మరో వాదన వినపడుతుంది. కృష్ణా జలాల హక్కులను ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కట్టబెట్టిందంటూ ఇక్కడి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ విమర్శలకు కూడా బలమైన ఆధారాలే చూపిస్తున్నాయి ఇక్కడి విపక్ష పార్టీలు. అయితే ఇందులో ఎవరి వాదనలో నిజం ఉందో…, ఎవరి వాదన న్యాయపరమైందో తేల్చాల్సిన కేంద్ర ప్రభుత్వం మాత్రం నోరు విప్పదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటితో నిప్పు రాజేసి గట్టున కూర్చొని చలి మంట కాసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.