ప్రజలను ప్రాధేయపడుతూ మళ్ళీ మా నమ్మకం నువ్వే అంటే ఎలా?

YS-Jagan-Mohan-Reddy-YSRCPకబాడీ ఆటలో ఆటగాళ్లు బరిలో దిగినప్పటి నుంచి వెనక్కు తిరిగివచ్చే వరకు ఒకటే కూత పెడుతుంటారు. అది ఆ ఆట నియమం. కానీ రాజకీయాలలో అది కుదరదు. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో, కొత్త అంశాలతో ముందుకుసాగాల్సి ఉంటుంది. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతీ ‘బటన్ నొక్కుడు’ సభలో ఒకటే కూత (వాదన) పెడుతుంటారు.

ADVERTISEMENT

“నేను ప్రజలకు మేలు చేస్తున్నాను. కనుక ప్రజలు నన్ను ఆదరించాలి. ప్రతిపక్షాలు తోడేళ్ళ గుంపులా ఒంటరిగా ఉన్న నాపైకి వస్తున్నాయి. నేను మిమ్మల్ని, పైనున్న ఆ దేవుడినే నమ్ముకొన్నాను. సంక్షేమ పధకాలని చూసి మళ్ళీ వైసీపీకి ఓట్లేసి నన్ను గెలిపించండి.” ఏ సభలోనైనా ఇదే సిఎం జగన్‌ ప్రసంగాల సారాంశం.

ఈరోజు బాపట్ల జిల్లాలోని నిజాంపట్నంలో సిఎం జగన్‌ బటన్ నొక్కి మత్స్యకారులకు 5వ విడత భరోసా పధకం కింద రూ.231 కోట్లు నిధులు విడుదల చేశారు. అక్కడా ఇంచుమించు మళ్ళీ ఇదే చెప్పారు.

జగన్‌ ప్రసంగాలు ఇలా వేడికోలుగా సాగుతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం మాకు తిరుగేలేదు…. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘనవిజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అని చాలా ధీమాగా మాట్లాడుతుండటం విశేషం. వైసీపీలో మరో విచిత్రమైన పరిస్థితి కూడా కనిపిస్తుంటుంది. ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నవారే మళ్ళీ ‘ప్రజలు జగనన్న మొహం చూసే ఓట్లు వేస్తారని, తామందరం నిమిత్తమాత్రులేమేనని చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. ఇంతకీ వైసీపీ నేతలు సొంత బలంతో పోటీ చేసి గెలుస్తారా లేక జగనన్న ఫోటో వలన గెలుస్తామని అనుకొంటున్నారా? ఇంతకీ వైసీపీలో ఎవరు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు?

ఇక ఈ బటన్ నొక్కుడు సభలలో జగన్‌ తాను ఒంటరివాడినని, తనపై తోడేళ్ళ గుంపు దాడి చేయబోతోందని, కనుక మీరే నాకు ఓట్లు వేసి ఆదుకోవాలని ప్రజలను వేడుకొంటుంటే, ఈ సభలకు వచ్చే మహిళల చేతుల్లో “మా నమ్మకం నువ్వే జగన్‌” ప్లకార్డులు పెట్టడం విడ్డూరంగా ఉంది.

అయినా 175/25 సీట్లు మావేనని బల్లగుద్ది వాదించే వైసీపీ అధినేత ప్రజలను ఇంతగా ప్రాధేయపడాల్సిన అవసరం ఏమిటి? ప్రాధేయపడుతున్నప్పుడు మళ్ళీ ప్రజల చేతుల్లో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ ప్లకార్డులు పెట్టడం దేనికి?ఇంతకీ జగనన్నని ప్రజలను నమ్ముకొని ఉన్నట్లా లేక జగనన్నే ప్రజలను నమ్ముకొని ఉన్నట్లా?

ADVERTISEMENT
Latest Stories