విశాఖలో రిజర్వ్ బ్యాంక్! మరో కొత్త డ్రామా దేనికంటే….

Jagan Reserve Bank Of India Visakhapatnam

ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 58 నెలలు అవుతోంది. ఇన్నేళ్ళలో ఒక్క పెద్ద నిర్ణయం తీసుకోలేదు. జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా కనిపెట్టి గొప్పగా చెప్పుకున్నమూడు రాజధానులు, విశాఖ రాజధానిని ఏర్పాటు చేయలేకపోవడమే ఓ అతి పెద్ద ఉదాహరణ.

ADVERTISEMENT

విశాఖలో రాజధాని ఏర్పాటుకి ప్రతిపక్షాలు, న్యాయస్థానాలు అవరోధాలు కల్పిస్తున్నాయని తప్పించుకున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్ వంటి సంస్థలని ఏర్పాటు చేయడానికి ఎటువంటి అవరోదమూ ఉండదు కదా?కానీ వాటినీ ఏర్పాటు చేయలేకపోయింది.

రిజర్వ్ బ్యాంకు కార్యాలయం, సిబ్బంది నివాసాల కోసం గత టిడిపి ప్రభుత్వం అమరావతిలో 11 ఎకరాలు కేటాయించింది. జగన్‌ ప్రభుత్వం అమరావతిని వద్దనుకొంది కనుక అక్కడ రిజర్వ్ బ్యాంకు ఏర్పాటువద్దనుకొంటే అర్దం చేసుకోవచ్చు. కానీ అక్కడ వద్దనుకున్నప్పుడు వెంటనే విశాఖ, కర్నూలు, తిరుపతి ఎక్కడో అక్కడ ఏర్పాటు చేయించవచ్చు కదా?కానీ చేయలేదు.

విశాఖలో రిజర్వ్ బ్యాంకుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఇతర సంస్థల ప్రధాన కార్యాలయాలు కూడా విశాఖలో ఏర్పాటు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం పూనుకొని, వాటిని ఏర్పాటు చేయించి ఉండి ఉంటే, నేడు వాటిని చూపిస్తూ తాము విశాఖ రాజధానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకునే అవకాశం లభించి ఉండేది. కానీ జగన్‌ ప్రభుత్వం 80 మంది సలహాదారులని పెట్టుకున్నా వారిలో ఏ ఒక్కరూ ఈ సలహా ఇవ్వలేదు.

కానీ ఇన్నేళ్ళుగా ఏ నిర్ణయం తీసుకోకుండా, ఇప్పుడు మరో 60 రోజులలో అధికారంలో నుంచి దిగిపోబోతుంటే, జగన్‌ ప్రభుత్వానికి హటాత్తుగా విశాఖలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగింది. వెంటనే దానికి అవసరమైన భవన సముదాయాన్ని గుర్తించాలంటూ రాష్ట్ర ఆర్ధిక శాఖ విశాఖ జిల్లా కలెక్టర్‌కు లేఖ వ్రాసింది. ఇన్నేళ్ళు పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు ఈ హడావుడి దేనికంటే సమాధానం అందరికీ తెలుసు.

విశాఖా రాజధాని పేరుతో కనీసం ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపి క్లీన్ స్వీప్ చేసేయాలని ప్లాన్ వేసింది. కానీ ‘హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా చేయాలంటూ’ మొన్న వైవీ సుబ్బారెడ్డి చేత చెప్పించి వైసీపి అధినేత మనసులో ఈ ఆలోచనని బయటపెట్టేసుకుంది.

దాంతో ఒకవేళ మళ్ళీ వైసీపి అధికారంలోకి వచ్చినా విశాఖలో రాజధాని ఏర్పాటు చేయబోదనే తప్పుడు సంకేతాలు పంపిన్నట్లయింది. కనుక విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయబోతున్నామని ప్రజలను మభ్యపెట్టడానికే ఈ కొత్త హడావుడి అని భావించవచ్చు.

అయితే త్వరలో సిఎం జగన్‌ విశాఖకు వచ్చేస్తారంటూ, మంత్రులు విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకొంటున్నారంటూ వైసీపి ఆడిన డ్రామాలన్నీ రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూశారు. కనుక ఈ రిజర్వ్ బ్యాంక్ డ్రామాతో ప్రజలను మభ్యపెట్టవచ్చని జగన్‌ ప్రభుత్వం అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది… కదా?

ADVERTISEMENT
Latest Stories