వైసీపీకి ప్రత్యర్ధి చంద్రబాబు కాదు.. జగన్‌?

Jagan Mohan Reddy YSRCP political strategy

ఒక అబద్దాన్ని నిజమని ప్రజలను నమ్మించాలనుకోవడమే పెద్ద పొరపాటు. అది తప్పని తెలిసిన తర్వాత… ప్రభుత్వానికి, ప్రజలకు క్షమాపణ చెప్పకపోయినా పర్వాలేదు. కానీ ఆ తప్పుతో రాజకీయ మైలేజ్ పొందాలనుకోవడం దాని కోసం మరో పెద్ద తప్పు చేయడం రాజకీయాలలో ఆత్మహత్యతో సమానం.

నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్నట్లు.. నేను పాలించే రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ప్రజలు ఇచ్చిన ఓ గొప్ప అవకాశాన్ని జగన్‌ చేజార్చుకున్నారు. ఐదేళ్ళ తప్పులు, పాపాలకు ప్రజలు లెక్కకట్టి 11 సీట్లు చాలని తేల్చారు.

ADVERTISEMENT

కనుక అప్పటి నుంచి అయినా తీరు మార్చుకొని, శాసనసభలో ప్రధాన ప్రతిపక్షనేత హోదా కోసం ఆరాటపడకుండా ప్రజలలో ప్రధాన ప్రతిపక్షనేతగా ప్రజాసమస్యలపై పోరాడుతూ ఉంటే బహుశః ప్రజల మనసులు కరిగేవేమో?

అయన కూడా తండ్రిలాగే సమూలంగా మారరని నమ్మకం కలిగితే ప్రజలే తిరిగి ఆయనను నెత్తిన పెట్టుకునేవారు. కానీ జగన్‌ ప్రతిపక్షనేతగా కూడా ఓ గొప్ప అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారని చెప్పక తప్పదు.

రప్పా రప్పా మొదలు నిన్న శాప్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు చేసిన దాడుల వరకు ప్రతీదీ.. అరాచకత్వానికి నిదర్శనంగానే ఉన్నాయి.

ప్రజల మనసులను ప్రేమతో గెలుచుకోవాలని మొన్ననే పేర్ని నాని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచుతూ ఆ విధంగానే ప్రయత్నించారు.

కానీ ఆ ప్రయత్నాలు ఫలించక పోవడంతో ఇప్పుడు ప్రజలను భయబ్రాంతులను చేసి, వారు తమకి భయపడి వైసీపీకి ఓట్లు వేసేలా చేయాలనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలా వ్యవహరిస్తూ చేజేతులా అధికార పార్టీలకు అవకాశం కల్పిస్తూ, మళ్ళీ వాటిపైన రాజకీయంగా పైచేయి సాధించవచ్చనుకోవడం రాజకీయ అవివేకమే అనిపిస్తుంది.

ఇంకా విషాదం ఏమిటంటే, రాష్ట్రంలో వైసీపీ ఇంతగా చెలరేగిపోతున్నా సిఎం చంద్రబాబు నాయుడు కటిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తుండటం.

కానీ ఇలాంటి వైసీపీ వ్యూహాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప శాంతిభద్రతల సమస్యగా పరిగణించి లాఠీఛార్జిలు చేయిస్తే, వైసీపీ కోరుకున్నట్లే చేసి దాని ఉచ్చులో పడినట్లవుతుంది.

నిన్న శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలు రాష్ట్ర ప్రజలందరూ కళ్ళారా చూశారు. కనుక అక్కడ ఏం జరిగిందో ప్రజలకు అర్ధమవ్వాలంటే కొంత సంయమనం తప్పదు. సిఎం చంద్రబాబు నాయుడు అదే చేశారు.

అలాగని శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నవారిని ఉపేక్షించడం లేదు. అక్కడ దాడులకు పాల్పడినవారిపై కేసులు నమోదు, అరెస్టులు ఎలాగూ ఉంటాయి. కనుక ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోలేదు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందనే విషయం గ్రహించాలి.

కూటమి ప్రభుత్వం సంగతెలా ఉన్నా, వైసీపీ ఈవిధంగా వ్యవహరిస్తూ కూర్చొన్న కొమ్మనే నరుక్కుంటోందని చెప్పక తప్పదు.

ఈ నమ్మకం, ఈ ధైర్యంతోనే విజయసాయి రెడ్డి కొత్త పార్టీతో వస్తున్నారనిపిస్తుంది. రేపు ఆయన పార్టీలోకి ఫిరాయింపులు మొదలైతే అప్పుడు అవునో కాదో తెలుస్తుంది.

ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సమయం మించిపోలేదు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. కనుక ఇకనైనా శాసనసభకు, ప్రజల మధ్యకు వచ్చి నిజమైన ప్రజా సమస్యలపై నిజాయితీగా పోరాడితే, ఆయనలో ఈ మార్పుని ప్రజలు తప్పకుండా గుర్తించగలరు. ప్రజలకు ఈ నమ్మకం కలిగితే భవిష్యత్‌లో మళ్ళీ తప్పక అవకాశం ఇస్తారు.

కానీ ఇలాగే కొనసాగితే, ఆ తర్వాత ఎవరినీ నిందించాల్సిన అవసరం, అవకాశం కూడా ఉండదు.

ADVERTISEMENT
Latest Stories