జగన్‌ పరువు… ఎవరో తీయాలా?

ys-jagan-prestige

ఎవరి పరువు ఎంతో సమాజమే చెపుతుంది. అయినా గ్రహించలేరు కొందరు. కనుక తమ పరువుకి వెల కట్టుకొని కోర్టులని ఆశ్రయిస్తుంటారు. జగన్‌ కూడా తన పరువు ఖరీదు వంద కోట్లుగా నిర్ణయించుకొని ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు.

ADVERTISEMENT

అదానీ వ్యవహారంలో తన పరువుకి నష్టం కలిగించేలా వార్తలు, కధనాలు వ్రాశాయంటూ జగన్‌ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడేలపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఆ వార్తలని ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అయ్యేందుకు తోడ్పడినందుకు ‘గూగుల్’ని కూడా పరువు నష్టం దావాలో ప్రతివాదిగా చేర్చారు.

అమెరికా న్యాయస్థానంలో అదానీ గ్రూప్‌పై ఓ కేసు నమోదు అయ్యింది. దానిలో ఆ సంస్థ ఇదివరకు ఏపీ అధికారంలో ఉన్న ఓ ప్రభుత్వ పెద్దలకు రూ.1,750 కోట్లు ముట్టజెప్పి ఆర్ధిక నేరానికి పాల్పడిందని పేర్కొంది.

జగన్‌ ప్రభుత్వం అదానీ గ్రూప్‌ దగ్గర లంచం తీసుకొని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు 25 ఏళ్ళకు ఒప్పందం చేసుకున్నారని సాక్షాత్ సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

అదే విషయం మీడియా కూడా పేర్కొంది. సెకీతో జగన్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వలన రాష్ట్రానికి ఎంతగా నష్టం కలుగుతుందో, ఎంత భారం పడుతుందో వివరించి చెప్పాయి. కనుక జగన్‌ అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రజలపై భారం మోపారని పేర్కొన్నాయి.

కానీ సెకీతో ఒప్పందం చేసుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తాను ఎంతో మేలు చేశానని, కనుక శాలువలు కప్పి సన్మానం చేసి అవార్డు ఈయవలసి ఉండగా, మీడియా తనపై బురద జల్లుతోందని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయా మీడియా సంస్థలు వారం రోజులలోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇప్పుడు అదే చేశారు.

అయితే పరువు నష్టం దావా వేయడం వలన జగన్‌-సెకీ-అదానీ గ్రూప్‌ మద్య జరిగిన ఒప్పందాన్ని జగన్‌ స్వయంగా ఢిల్లీ హైకోర్టు చేతిలో పెట్టిన్నట్లయింది. కనుక దానిపై న్యాయస్థానం మరింత లోతుగా పరిశీలించి చూస్తుంది. ఒకవేళ దాని కోసం జగన్‌ ప్రభుత్వం ముడుపులు తీసుకున్నట్లయితే అదీ బయటపడుతుంది.

ఇప్పటికే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో యావత్ దేశ ప్రజలు తిరుమల శ్రీవారికి జగన్‌ తీరని అపచారం చేశారని గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు జగన్‌ స్వయంగా ఢిల్లీ హైకోర్టులో ఈ పరువు నష్టం దావా వేసి ఈ వ్యవహారంపై మళ్ళీ చర్చ మొదలయ్యేలా చేశారు. కనుక ఈ భాగోతం గురించి కూడా దేశ ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. కనుక జగన్‌ తన పరువు తానే తీసుకుంటున్నట్లు చెప్పొచ్చు.

ఆంధ్రాకే పరిమితమైన జగన్‌ తన గురించి దేశ ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోనవసరం లేకపోవచ్చు. కానీ జగన్‌ గురించి జాతీయ మీడియాలో ఇటువంటి వ్యతిరేక వార్తలు వస్తుంటే మోడీ ప్రభుత్వం ఆయనని మరింత దూరంగా పెట్టకతప్పదు. కనుక పరువు నష్టం దావా వలన వైసీపీకి ఈవిదంగా కూడా నష్టం కలుగక మానదు.

ADVERTISEMENT
Latest Stories