‘యంగ్ టైగర్’ అభిమానులు ఎంతగానో నిరీక్షించిన “జై లవకుశ” ఆడియో లహరి సంస్థ ద్వారా నేరుగా యూ ట్యూబ్ లోకి విడుదలైంది. ‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ మ్యూజికల్ హిట్స్ దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ – దేవిశ్రీప్రసాద్ కాంభినేషన్ లో ‘హ్యాట్రిక్’ మూవీగా రాబోతున్న “జై లవకుశ” ఆడియోపై అంచనాలు బాగా ఉన్నాయి. మరి వీటిని అందుకుందా అంటే… ఆడియో అంతటిని డామినేట్ చేసే విధంగా ‘జై’ పాత్రకు సంబంధించిన ‘రావణా…’ అనే పాట నిలుస్తోంది.
ఈ సినిమాలో ఆడియోకు పెద్దగా స్కోప్ లేదనే విధంగా కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయి. అందులో ఆల్బమ్ కే హైలైట్ నిలిచిన ‘రావణా…’ పాట కూడా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేదే గానీ, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ కాకపోవడం విశేషం. అంటే సినిమాకు అందించిన పాటల కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ సంగీతానికే ఈ సినిమాలో ప్రాధాన్యత ఉందన్న విషయం చిత్ర యూనిట్ చెప్పకనే చెప్తోంది. ఇక మిగిలిన మూడు పాటల్లో ‘ట్రింగ్ ట్రింగ్’ పాట ‘శ్రీమంతుడు’ సినిమాలోని ‘ఓ చారుశీల’ పాటను దేవిశ్రీ దింపేసినట్లుగా వినపడుతోంది.
‘నీ కళ్ళలోనే’ పాటలో ‘అసుర అసుర’ అంటూ వచ్చే పల్లవి అదరగొడుతుండగా, చివరిది ‘దోచేస్తా’ మాస్ బీట్ గా స్వరపరిచారు. ఆడియో పరంగా ‘రావణా’ అన్న పాటను మినహాయిస్తే… ఏం లేదనే చెప్పుకోవాలి. ఒక్కసారి ఈ సినిమా టీజర్లను, ఆడియోను పరిశీలిస్తే… ‘జై’ పాత్రకు సంబంధించినంత వరకు అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లుగా కనపడుతోంది. ‘జై’ పాత్రతో కూడిన తొలి టీజర్ గత యూ ట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టగా, తాజాగా ‘రావణా’ అన్న ట్రాక్ సంగీత ప్రియుల చెవుల్లో మోత మోగిస్తోంది.
అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం సినిమాలో మొత్తం అయిదు పాటలు ఉన్నాయని, అయిదో పాటను అభిమానుల కోసం దాచి ఉంచారని తెలుస్తోంది. బహుశా ‘రావణా’ పాట తదుపరి స్థానంలో ఈ అయిదవ పాట నిలిచే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. యంగ్ టైగర్ అదిరిపోయే స్టెప్పులు వేసే విధంగా మాంచి డ్యాన్సింగ్ బీట్ తో ఈ అయిదో పాటను దేవి స్వరపరిచినట్లుగా టాక్. సినిమా విడుదల సమయానికి కాస్త ముందర ఈ చివరి పాటను విడుదల చేసే విధంగా ప్లానింగ్ జరుగుతోంది. అప్పటివరకు అయితే ‘రావణా’నే వినిపించడం ఖాయం.


