బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన “జై లవకుశ” ఆడియో ఆల్బమ్ శ్రోతలను నిరాశపరిచిన విషయం తెలిసిందే. వినడానికి ‘రావణా…’ అదిరిపోగా, చూడడానికి ‘ట్రింగ్ ట్రింగ్…’ పర్వాలేదనిపించే విధంగా ఉండగా, మిగిలిన రెండు అటు అభిమానులను గానీ, ఇటు సంగీత ప్రియులను గానీ ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈ సినిమాలో దాచిన ‘స్పెషల్’ సాంగ్ ను ఈ శుక్రవారం నాడు విడుదల చేయబోతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, తమన్నాలపై చిత్రీకరించిన ఈ పాట ఒక రేంజ్ లో వచ్చిందని ట్రేడ్ టాక్. దేవిశ్రీ మాస్ బీట్స్ కు తోడు జూనియర్ ఎన్టీఆర్ ‘నెవర్ బిఫోర్’ స్టెప్స్ ఈ పాటకు హైలైట్ గా నిలుస్తాయని వస్తున్న టాక్ ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ ను నూతన ఉత్సాహంలో ముంచెత్తుతున్నాయి. నిజానికి “జై లవకుశ” సినిమాకే హైలైట్ గా ఈ పాట నిలుస్తుందని, అందుకే చివరగా విడుదల చేస్తున్నారని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.
వచ్చే గురువారం నాడు విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తారక్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా ఖరారు చేసుకోవచ్చు. తొలి నాలుగు రోజుల్లోనే రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు కూడా ఫిక్స్ అయిపోయారు. వీకెండ్ ముగిసిన తర్వాత తారక్ ప్రభంజనం ఎలా ఉంటుందనే దానిపైనే “జై లవకుశ” రేంజ్ డిసైడ్ అవుతుంది. ‘టెంపర్’ నుండి ఒక్కో మెట్టు ఎక్కుతున్న జూనియర్, ఈ సినిమా విజయం సాధిస్తే… ఏకంగా రెండో, మూడో మెట్టుపై నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


