చిన్న మరియు ఓ మోస్తరు సినిమాల విడుదలకు ఈ నెలలో ఇదే చివరి వారం కానుంది. సెప్టెంబర్ 21వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ “లవకుశ” సినిమా విడుదల అవుతుండగా, ఆ తదుపరి వారంలో మహేష్ బాబు “స్పైడర్” సినిమా విడుదల కానుంది. అలాగే ఈ రెండింటితో పాటు శర్వానంద్ “మహానుభావుడు” రూపంలో 29వ తేదీన మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాబోతున్నాడు. దీంతో ఈ మూడు సినిమాల చుట్టూనే ధియేటర్లు తిరగనున్నాయి.
దీంతో ఇప్పటికే వాయిదాలు పడుతూ వచ్చిన ఓ ఆరు సినిమాలు ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విశేషం ఏమిటంటే… ఇవన్నీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా… వాయిదాల పర్వంతో, ఎట్టకేలకు ఈ 15కి ఫిక్స్ అయ్యాయి. అందులో ముందుగా సునీల్ “ఉంగరాల రాంబాబు” ఉండగా, తదుపరి స్థానంలో నారా రోహిత్ – నాగశౌర్యల “కథలో రాజకుమారి” మరియు సందీప్ కిషన్ “ప్రాజెక్ట్ జెడ్” సినిమాలు హీరోల పరంగా విడుదలకు సిద్ధమయ్యాయి.
ఇక రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన “శ్రీవల్లి” సినిమా, సచిన్ జోషి “వీడెవడు” మరియు శింబు, నయనతారల డబ్బింగ్ బొమ్మ “సరసుడు” కూడా క్యూలో ఉన్నాయి. ఈ ఆరు సినిమాలో కనీసం ఒక్క సినిమాపై కూడా ప్రేక్షకులకు ఎలాంటి అంచనాలు లేకపోవడం విశేషం. ఒక రకంగా ఆయా చిత్రాలకు ఇది ప్లస్ పాయింటే అయినప్పటికీ, ఓపెనింగ్స్ లేకపోతే తర్వాత టాక్ వచ్చినా, ప్రదర్శించడానికి ధియేటర్లు ఉండవన్న విషయం తెలిసిందే. టాక్ వస్తే… మహా అయితే ఓ 10, 12 రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద అవకాశం వస్తుంది.


