రాష్ట్ర విభజన తో ఆవిర్భవించిన జనసేన ఏపీలో రాజకీయంగా ఎదుగుతుంది. పుష్కరకాల జనసేన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఓటములు, మరెన్నో అవహేళనలు ఎదుర్కొంది. 2024 ఎన్నికల తరువాత ఆ ఓటమి భారాలకు, అవహేళన విమర్శలకు చెక్ పెట్టేలా పోటీ చేసిన 21 స్థానాలలో 21 నెగ్గి దేశ రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లికించుకుంది.
అయితే పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఏపీలో జనసేన బలం పెరిగిందా అంటే ఖచ్చితంగా పెరిగింది అని చెప్పలేని పరిస్థితి, అలా అని పవన్ చరిష్మా తగ్గింది అనడానికి లేదు. పవన్ పార్టీ పరంగా కంటే కూడా ప్రభుత్వం పరంగా ప్రజల మనసు గెలుస్తున్నారు. ప్రభుత్వంలో భాగమైన పవన్ తానూ తీసుకుంటున్న పాలనాపరమైన నిర్ణయాలతో సామాన్యులను మెప్పిస్తున్నారు.
ఆ రకంగా చూసుకుంటే రాష్ట్రంలో జనసేన బలం పెరుగుతుంది అనే చెప్పవచ్చు. అయితే పార్టీ పరంగా చుస్తే పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు జనసేనకు అన్ని తానే అయ్యి నడిపిస్తున్నారు పవన్. ఇన్నేళ్ల తరువాత కూడా జనసేనలో పవన్ మాదిరి ప్రజలలో చరిష్మా ఉన్న నేత కనిపించకపోవడం జనసేనకు ఒకరంగా ఇబ్బందిఆక్రమిన అంశమే.
పార్టీ బలోపేతం కోసం పవన్ సమయం చిక్కినప్పుడల్లా పార్టీ సమావేశాలు నిర్వహించి పార్టీ నేతలను, క్యాడర్ ను యాక్టీవ్ చేసే పనిలో ఉంటున్నారు. ఇక రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, పంచాయితీ, అటవీ శాఖ మంత్రిగా పవన్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఇటు కూటమి ప్రభుత్వం తో పాటుగా జనసేన బలోపేతానికి కూడా బాటలు వేస్తున్నాయి.
గ్రామాల అభివృద్దే ధ్యేయంగా, పంచాయితీల బలోపేతానికి పవన్ శ్రీకారం చుట్టారు. పంచాయితీ శాఖలో తానూ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా దేశంలోనే ఏపీ పంచాయితీ శాఖకు మొదటి స్థానం దక్కింది. ఇక అటు గిరిజన ప్రాంతాలైన అరకు, పాలేరు వంటి తండాలలో పవన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఆయా ప్రాంత ప్రజల ప్రసంసలు పొందాయి.
దశాబ్దాల తమ కలలను పవన్ నెరవేరుస్తున్నారంటూ ఆయా ప్రాంత ప్రజలు జనసేన జెండా పట్టుకుంటున్నారు. ఇలా పవన్ అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వం పరంగా తన పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ ఆశించినట్టుగా ఏపీలో జనసేన రాజకీయంగా మరింత బలపడితే అది వైసీపీ ని రాజకీయంగా బలహీనపరిచినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
టీడీపీ, బీజేపీ లతో రాజకీయ పొత్తు మరో పదిహేనేళ్ళు తప్పనిసరి అంటూ పవన్ పదేపదే ప్రకటిస్తున్న సందర్భంలో జనసేన బలోపేతం కూటమి కి అదనపు బలంగా మారుతుంది. రాష్ట్రంలో కూటమి రాజకీయంగా మరింత బలపడితే దాని ప్రభావం ఖచ్చితంగా వైసీపీ ని బలహీనపరుస్తుంది.
టీడీపీ పార్టీకున్న దశాబ్దాల రాజకీయ అనుభవం ఆ పార్టీని రాజకీయ ఒడిదుడుకుల నుంచి క్షేత్ర స్థాయిలో తిరిగి నిలబెట్టగలదు. జనసేన కూడా అదే విధంగా గ్రౌండ్ లెవెల్ లో బలం పుంజుకుంటే వైసీపీ బలహీనపడినట్టే. పవన్ రాజకీయ ఎదుగుదల జగన్ కు రాజకీయంగా ఎదురుదెబ్బగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే వైసీపీ పవన్ టార్గెట్ గా కుల రాజకీయాలు మొదలుపెట్టిందా అన్న చర్చ మొదలయ్యింది.






