బొత్సపై జగన్‌కు నమ్మకం ఉందో లేదో?

Botsa Satyanarayana political controversy

విజయనగరం జిల్లా వైసీపీలో వరుస పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరి బొత్స సత్యనారాయణకు షాక్ ఇస్తే.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు బొత్స కుటుంబానికే ఎదురుదెబ్బలుగా మారుతున్నాయి.

టీడీపీలో చేరిన తర్వాత చిన్న శ్రీను తొలిసారి ఆనంద గజపతి రాజుగారి కోటలో అడుగుపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించినట్లు సమాచారం.

ADVERTISEMENT

ఇదే సమయంలో చిన్న శ్రీను జంపింగ్ ఎఫెక్ట్ బావ అప్పలనాయుడుపై పడింది. నెల్లిమర్ల వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయనను ఆ పదవి నుంచి వైసీపీ అధినేత జగన్ తొలగించారు. ఆయన స్థానంలో సన్యాసి నాయుడును నియమించారు.

ఇక ఇంతకాలం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో ఆ పదవిని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు అప్పగించారు. అయితే జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ హవా కొనసాగుతున్న సమయంలో ఈ పదవి ఆయన వర్గానికి కాకుండా బెల్లానకు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బొత్స కుటుంబానికి అత్యంత కీలకమైన సమయంలో జగన్‌ చేసిన ఈ మార్పులతో ఆయనకు బొత్సపై నమ్మకం ఉందా లేదా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

చిన్న శ్రీను పార్టీ మారడంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినా తనను పదవి నుంచి ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదని అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మరి కొంతమందిని టీడీపీలోకి తీసుకువస్తానని చిన్న శ్రీను ఇప్పటికే ప్రకటించారు. కనుక బావని కూడా టీడీపీలోకి తీసుకుపోతారా? అనే కొత్త చర్చ మొదలైంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చిన్న శ్రీను వైసీపీ నుంచి మరికొందరు నేతలను టీడీపీలోకి తీసుకెళ్తే.. జిల్లాలో వైసీపీ పరిస్థితి ఎలా మారుతుంది? జగన్‌ చేసిన ఈ మార్పులు, చేర్పులు పార్టీకి మేలు చేస్తాయా? లేక మొదటికే మోసం వస్తుందా? ఈ మార్పులు చేర్పుల వలన తన కుమార్తెను జెడ్పీ చైర్‌పర్సన్‌గా చూడాలన్న బొత్స సత్యనారాయణ కల నెరవేరుతుందా?

ప్రస్తుతం ‘లోకల్ సీజన్‌’లో రెండు ఎపిసోడ్స్ మాత్రమే పూర్తయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించేలోగా మరికొన్ని ఎపిసోడ్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. అవన్నీ పూర్తయిన తర్వాతే విజయనగరం జిల్లాలో టీడీపీ-వైసీపీ లెక్కలు తేలుతాయి. అవి వైసీపీకి అనుకూలంగా ఉంటే జగన్ వ్యూహం ఫలించినట్లు, లేకుంటే సిఎం చంద్రబాబు నాయుడు లెక్కలు ఫలించినట్లు లెక్క! ఈ లెక్కలు వచ్చే ఎన్నికలకు కూడా వర్తించే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories