తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన పార్టీ 8 స్థానాలకు పోటీ చేసింది. జనసేనతో పొత్తు వలన బీజేపీ గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకోబోతోంది కానీ బీజేపీతో పొత్తుపెట్టుకొని జనసేన కనీసం కూకట్‌పల్లి ఒక్క సీటుని కూడా గెలుచుకోలేని పరిస్థితిలో కనిపిస్తోంది. ఇప్పటి వరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో బీజేపీ 10 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుండగా, జనసేనకు అప్పుడే అశ్వారావు పేటలో కాంగ్రెస్ చేతిలో తొలి ఓటమి చవి చూసింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖమ్మం, కొత్తగూడెం, కూకట్‌పల్లిలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎప్పటిలాగే వేలాదిమంది అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన వెంట జనసేన జెండాలు పట్టుకొని బైక్‌లపై హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే కూకట్‌పల్లితో సహా జనసేన పోటీ చేసిన 8 నియోజకవర్గాలలో కాంగ్రెస్ లేదా బిఆర్ఎస్ పార్టీల అభ్యర్ధులు మాత్రమే ఆధిక్యతలో కొనసాగుతుండటం గమనిస్తే పవన్ కళ్యాణ్ వెంట పరుగులు తీసిన వారెవరూ జనసేన అభ్యర్ధులకు ఓట్లు వేయలేదని స్పష్టం అవుతోంది. అయితే తన వెంట వచ్చి చప్పట్లు కొట్టేవారందరూ తన పార్టీకి ఓట్లు వేయరని పవన్ కళ్యాణ్‌కు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు బరిలో దిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కానీ ఆలోచించినట్లు లేదు. కనుక మళ్ళీ అదే ఫలితం వస్తోందిప్పుడు.
పవన్ కళ్యాణ్ ప్రధానంగా కూకట్‌పల్లిపై దృష్టి పెట్టి గట్టిగా ఎన్నికల ప్రచారం చేశారు. కానీ అక్కడ జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రేమ్ కుమార్ 14,954 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమవుతున్నారు. అక్కడ 3వ రౌండ్ లెక్కింపు ముగిసే సరికి బిఆర్ఎస్ అభ్యర్ధి మాధవరం కృష్ణారావు 29,805 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
జనసేన పోటీ చేసిన ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు భారీ ఆధిక్యతతో దూసుకుపోతుండగా, కొత్తగూడెం, వైరా, నాగర్‌కర్నూల్, కోదాడ, తాండూర్‌లో కూడా జనసేన అభ్యర్ధులు వెనకబడిపోయున్నారు. అయితే తెలంగాణలో ఈసారి బిఆర్ఎస్, కాంగ్రెస్‌ల మద్య గట్టి పోటీ జరుగుతోందని, బీజేపీ లోపాయికారిగా బిఆర్ఎస్ పార్టీకి సహకరిస్తోందని తెలిసి ఉండి కూడా జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీకి దిగడం రాజకీయ తప్పటడుగులే అని చెప్పక తప్పదు.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో వారాహి యాత్రలు నిర్వహిస్తూ, కుల సంఘాల నాయకులతో సమావేశమవుతూ జనసేనను బలోపేతం చేసుకొన్నారు. కానీ తెలంగాణలో అటువంటి ప్రయత్నమేదీ చేయకుండానే ఎన్నికల బరిలో దిగడం, అదీ… బీజేపీని నమ్ముకొని దిగడం ఆయన భాషలోనే చెప్పాలంటే వీరమరణం కోసమే అని చెప్పక తప్పదు. అయితే ఈ ఓటమి, పరాభవం ముందు ఊచించిందే కనుక జనసేన వాటిని దిగమింగక తప్పదు. వైసీపి చేసే అవహేళనలను భరించకా తప్పదు.




