జూనియర్ ఎన్టీఆర్ తన గమ్య స్థానం చేరుకోవడానికి సర్వం సిద్ధమైంది. ఇక మిగిలింది సెప్టెంబర్ 1వ తేదీన తెలుసుకోవడమే… జూనియర్ గమ్యం ఏ పాటిదోనని..! బంద్ ప్రభావంతో ముందుగా ప్రకటించినట్లు సెప్టెంబర్ 2 నుంచి 1వ తేదీకి మారిన “జనతా గ్యారేజ్” రాక కోసం అభిమానుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఓ రెండు పోస్టర్లు అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి. చిత్ర యూనిట్ కూడా కాస్త తెలివిగా ఆలోచించి ఒకటి పూర్తి మాస్ గా, మరొకటి పక్కా క్లాస్ గా డిజైన్ చేసి మరీ విడుదల చేసింది.
మాస్ పోస్టర్ ని చూస్తూ ‘బుడ్డోడు’ అభిమానులు ఊగిపోతున్నారు. రికార్డులు బద్దలు కొట్టడానికి వస్తున్నాను అన్నట్లుగా… ఓ రాడ్ పట్టుకుని నిజంగానే బద్దలు కొట్టడానికి వస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ కు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ పోస్టర్ కు మరో సెంటిమెంట్ కూడా జోడయ్యింది. కొరటాల శివ మూడు సినిమాలలో కూడా ఇదే తరహాలో హీరో ఆయుధం పట్టుకుని ఉన్న స్టిల్స్ విడుదలై, అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ లెక్కన బాక్సాఫీస్ లో ‘కొత్త రికార్డులను చేర్చడం’ ఖాయం అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు బుడ్డోడు అభిమానులు.
ఇక, క్లాస్ పోస్టర్ ను చూస్తే… జూనియర్ ఎన్టీఆర్ కాస్త కొత్తగా కనపడుతున్నాడు. లుక్ పరంగా ఒకటే అయినా… ఇలాంటి క్లాస్ స్టిల్స్ జూనియర్ సినిమాలో చాలా అరుదుగా కనపడుతుంటాయి. బహుశా ‘బృందావనం’ తర్వాత ఆ స్థాయిలో క్లాస్ గా కనపడుతున్నాడు జూనియర్. అటు ఇటు ముద్దుగుమ్మలను పెట్టుకుని, రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని కనపడుతున్న ఈ పోస్టర్ కు క్లాస్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొత్తమ్మీద అన్ని వర్గాల వారిని “జనతా గ్యారేజ్” టార్గెట్ చేసిందని చిత్ర బృందం చెప్పకనే చెప్తోంది.



