తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఏర్పడుతోన్న పరిణామాలు సినీ ఫక్కీలో సాగుతుండడం గమనించదగ్గ విషయం. ఇప్పటికే జయలలితకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించగా, తాజాగా ఆ సంఖ్యకు మరొకటి పెరిగింది. అవును… జయలలిత ఎస్టేట్ కు సంబంధించిన సీరియల్ చావులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ సారి హత్య కాదు, ఆత్మహత్యగా నమోదు కావడం పరిశీలించాల్సిన అంశం.
జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ కు చెందిన అకౌంటెంట్ దినేష్ కుమార్ సోమవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తగిరిలోని సొంత నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు నెలల క్రితం కొడనాడు ఎస్టేట్ లో ఒక సెక్యూరిటీ గార్డును దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. జయ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను చోరీ చేయడానికి వచ్చిన వారు, ఈ గార్డును హతమార్చారు. ఆ తర్వాత వీరిలో ఒక్కరు రోడ్డు ప్రమాదంలో చనిపోగా, మరో వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
అయితే ఈ సీక్వెల్ చావులకు శుభంకార్డు ఎప్పుడు పడుతుంది. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ‘అమ్మ’ అభిమానులు విశ్వసిస్తున్నట్లు ఆత్మే ఇదంతా చేస్తోందా? లేక సినిమాలలో చూపించినట్లు ‘అమ్మ’ ఆస్తి కోసం జరుగుతున్న కుట్రలలో భాగంగా ఈ వరుస మరణాలు నమోదవుతున్నాయా? ఇప్పటివరకు జరిగిన మూడు అనుమనాస్పదపు మరణాలలో నమోదైన కేసుల్లో ఎక్కడా పురోగతి కనిపించకపోవడం అసలు విషయం. మరి అధికారంలో ఉన్న సొంత ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ప్రశ్నలకు కాలమే బదులు చెప్పాలి.



