పోయస్ గార్డెన్ లోని తన నివాసంలో జయలలితను ఎవరో కిందకు పడదోశారని, తీవ్రగాయాల పాలైన ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు నాటకమాడి, ఆమెను హత్య చేశారని అన్నాడీఎంకే సీనియర్ నేత పీహెచ్ పాండియన్ సంచలన ఆరోపణలు చేశారు. జయలలిత మృతి వెనుక ఎలాంటి వివాదాలు లేవని లండన్ వైద్యుడు రిచర్డ్ బేలె వెల్లడించిన మరుసటి రోజు పాండియన్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన, పోయిస్ గార్డెన్ లో జయలలితతో వాదన పెట్టుకున్న ఒకరు, ఆమెను గట్టిగా నెట్టి కిందకు పడదోశారని ఆరోపణలు చేసారు.
సెప్టెంబర్ 22వ తేదీన ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని డిమాండ్ చేశారు. జయలలిత మరణం తరువాత శశికళ కనీసం విచారాన్ని వ్యక్తం చేయలేదని పాండియన్ నిప్పులు చెరిగారు. తన ఇంట్లోనే తనకు నెమ్మదిగా విషం పెడుతున్నట్టు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన వద్ద భయాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారని కూడా పాండియన్ అభిప్రాయపడ్డారు. జయలలిత, ఎంజీఆర్ ఆశీర్వాదాలు శశికళపై లేవు కాబట్టే, ఆమె ప్రమాణ స్వీకారం చేయలేకపోయారని పాండియన్ తెలియజేశారు.
శశికళను పార్టీ కార్యదర్శిగా, తమిళనాడు సీఎంగా ఎవరూ అంగీకరించే పరిస్థితి లేదని, భవిష్యత్తులో శశికళకు సీఎం అయ్యే అవకాశాలు వస్తాయన్న అనుమానం జయలలితకు ఉండేదని, అలా జరగడం తనకు ఇష్టం లేదని జయలలిత ఓ సారి తనతో చెప్పారని పాండియన్ కుమారుడు, మాజీ ఎంపీ మనోజ్ వ్యాఖ్యానించారు. అయితే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న వీరంతా, శశికళ ముఖ్యమంత్రి పీఠం దగ్గరకు చేరుకునేపాటికి సంచలన ఆరోపణలతో మీడియా వర్గాలను హోరెత్తిస్తున్నారు.



