జేడీగారు… కొత్త పార్టీకి ఇప్పుడా ముహూర్తం? ఏంటి కధ?

JD-Lakshmi-Narayana-Jai-Bharath-Party

ఎన్నికలకు ముందు కొత్త రాజకీయపార్టీలు పుట్టుకు రావడం సహజమే. కానీ దాదాపు పదేళ్ళుగా రాజకీయాలలో ఉన్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ కూడా ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

ADVERTISEMENT

‘జై భారత్‌ నేషనల్ పార్టీ’ ని ప్రారంభిస్తున్నట్లు లక్ష్మినారాయణ విజయవాడలో శుక్రవారం ప్రకటించారు. గత ఎన్నికలలో లక్ష్మినారాయణ జనసేన అభ్యర్ధిగా విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేసి 4,400 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చేసి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ వివిద వర్గాల ప్రజలతో ముఖాముఖీ సమావేశమయ్యారు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గర నుంచి చూశారు కనుక వాటన్నిటికీ పరిష్కారం చూపడం కోసం రాజకీయ వేదిక అవసరమనుకొని పార్టీని స్థాపించానని లక్ష్మినారాయణ చెప్పారు.

అయితే తెలంగాణను ఎంతగానో అభివృద్ధి చేసిన కేసీఆర్‌ ఎన్నికలలో ఓడిపోయారు. సాక్షాత్ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా బీజేపీని గెలిపించుకోలేకపోయారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులు పెట్టుకొని జనసేన 8 స్థానాలకు పోటీ చేస్తే డిపాజిట్లు కోల్పోయింది.

తెలంగాణ ప్రభుత్వంలో పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరి దాదాపు మూడేళ్ళు తెలంగాణలో బడుగుబలహీన వర్గాలను ఏకం చేసేందుకు గట్టిగా ప్రయత్నించినప్పటికీ ఎన్నికలలో బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

ఇక ఏపీలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపి, దానిని ధీటుగా ఎదుర్కొంటున్న టిడిపి, జనసేనలు రాబోయే ఎన్నికలలో గెలిచేందుకు ముప్పతిప్పలు పడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఎన్నికలను అధికారం, డబ్బు, మద్యం శాసిస్తున్నాయని తెలిసి ఉన్నా ఎన్నికలకు కేవలం 3-4 నెలల ముందు లక్ష్మినారాయణ పార్టీ స్థాపించడంతో అనుమానాలు, అపోహలు కలిగిస్తున్నాయి. ఎన్టీఆర్‌ హయాంలో టిడిపి మినహా, కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు ఓట్లు చీల్చగలవు తప్ప గెలవలేవని ఎన్నికల చరిత్ర చూస్తే అర్దమవుతుంది.

ఒకవేళ రాబోయే ఎన్నికలలో జై భారత్‌ నేషనల్ పార్టీ పోటీ చేయకపోతే అనుమానించనవసరం లేదు. కానీ రాబోయే ఎన్నికలలో మళ్ళీ విశాఖ నుంచే పోటీ చేయాలనుకొంటున్నట్లు ఇటీవలే లక్ష్మినారాయణ చెప్పారు. కనుక ఆయన వెనక ఎవరున్నారు?ఆయన ఎవరి కోసం ఏ పార్టీ ఓట్లు చీల్చాలనుకొంటున్నారు?అని సందేహించక తప్పడం లేదు.

రేపు ఇదే ప్రశ్న ఏపీలోని పార్టీలు, రాజకీయ విశ్లేషకులు, మీడియా నుంచి కూడా ఆయనకు ఎదురవుతుంది. అప్పుడు ‘మేము ఏ పార్టీకి బీ టీం కాదు… మా వెనుక ప్రజలు మాత్రమే ఉన్నారు’ అనే లక్ష్మినారాయణ ఇన్‌స్టాంట్ సమాధానం చెప్పరనే ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories