అంగరంగ వైభవంగా తెలుగు, తమిళ, కన్నడ సినీ సెలబ్రిటీల నడుమ హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. అయితే ఈ వేడుక మరికొందరి సెలబ్రిటీలకు షాకింగ్ అనుభూతులను కూడా పంచిందన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసి వచ్చింది. ‘క్షణం’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన అడవి శేష్ మరియు ‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయలకు ఈ ఫిల్మ్ ఫేర్ చేదు అనుభవాలను మిగిల్చింది.
అవార్డుల విభాగంలో ఈ ఇద్దరి పేర్లను నామినీగా పరిశీలించిన అవార్డుల కమిటీ, ఈ వేడుకకు మాత్రం ఆహ్వానం పంపకపోవడం వీరిద్దరినీ తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ… అడవి శేష్ సూటిగా ఫిల్మ్ ఫేర్ ను ప్రశ్నించాడు. “నామినేషన్ లో చోటు ఇచ్చారు గానీ, ఇన్విటేషన్ మాత్రం పంపలేదు, కానీ, షో ప్రారంభానికి గంట ముందు క్షమాపణలు చెప్పడం సరైన విధానమేనా?” అంటూ ప్రశ్నించాడు.
దీనికి స్పందించిన అనసూయ… నాది సేం పించ్… అయితే నీకు కనీసం అపాలజీ అయినా చెప్పి గుర్తించారు, తనకు అది కూడా దక్కలేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో ఫిల్మ్ ఫేర్ అడవి శేష్ ను, అనసూయను అవమానించిందన్న విషయం స్పష్టమైంది. అయితే ఈ జాబితాలో వీరిద్దరేనా… గొంతు విప్పని సెలబ్రిటీలు ఇంకా ఉన్నారా..? దీంతో ఫిల్మ్ ఫేర్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.



