ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పైన, స్మాల్ స్క్రీన్ పైన జూనియర్ ఎన్టీఆర్ హవా నడుస్తోంది. వెండితెరపై “జై లవకుశ” ద్వారా అభిమానులను అలరిస్తుండగా, బుల్లితెరపై “బిగ్ బాస్” షోతో గ్రాండ్ ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. గత రెండున్నర్ర మాసాలుగా ‘బిగ్ బాస్’ షో ద్వారా తనలోని మరో యాంగిల్ ను ప్రేక్షకులకు రుచిచూపించిన తారక్, ఇప్పుడు ఆ షో ఫైనల్ డేకు చేరుకోవడంతో, ప్రేక్షకులకు సూపర్ కిక్ ఇచ్చే విధంగా ప్లానింగ్ జరుగుతోందని తెలుస్తోంది.
సాధారణంగా వీకెండ్ లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చే షో కార్యక్రమం గంటన్నర్ర నిడివి ఉంటుంది. కానీ ఫైనల్ డే మాత్రం ఇది నాలుగు గంటల పాటు సాగనుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నారన్న మాట. ఓ పక్కన మూడు పాత్రల ద్వారా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిపోతుండగా, మరో పక్కన స్మాల్ స్క్రీన్ పై కూడా దుమ్ము దులిపే విధంగా ప్లానింగ్ జరుగుతోంది. అయితే ఇది ‘జై లవకుశ’ సినిమాకు కూడా దోహదపడుతుందని చెప్పవచ్చు.


