బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన “జై లవకుశ” సినిమా మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధం కాగా, జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంపై కూడా ఓ స్పష్టత ఇచ్చారు. ఇంతకుముందు హల్చల్ చేసిన విధంగానే ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే ఈ సినిమా ఉండనుంది. అయితే అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ సినిమా ద్వారా తాను ఫుల్ మేకోవర్ కానున్నానని తారక్ స్పష్టత ఇచ్చారు. ‘జై లవకుశ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతులను చెప్పుకొచ్చారు తారక్.
త్రివిక్రమ్ తనను ఓ డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నారని, దానికి తగ్గట్లుగా తాను మారనున్నానని, ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు జూనియర్. ‘జై లవకుశ’లో మూడు డిఫరెంట్ రోల్స్ పోషించిన తర్వాత మళ్ళీ కంప్లీట్ గా మేకోవర్ అవ్వడం అనేది తనకు మరో అనుభూతి కలిగించే విషయమని చెప్పిన జూనియర్, ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు. అంటే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న పవన్ సినిమా పూర్తి కాగానే, దీనిని సెట్స్ పైకి తీసుకు వెళ్ళబోతున్నారన్న మాట.
ఈ మూడు నెలల పాటు జూనియర్, తన మేకోవర్ పై పూర్తి దృష్టి పెట్టబోతున్నారు. ఇందు నిమిత్తం “జై లవకుశ” సినిమా విడుదలైన తర్వాత విదేశాలకు కూడా వెళ్ళే ఆలోచన చేస్తున్నారు. అంటే ‘యంగ్ టైగర్’ను మరో పూర్తి వినూత్నమైన అవతారంలో చూసే అవకాశం అభిమానులకు కలగనుంది. త్రివిక్రమ్ – జూనియర్ ఎన్టీఆర్ కాంభినేషన్ కోసం అభిమానులు ఎప్పటి నుండో వేయి కళ్ళతో నిరీక్షిస్తున్న నేపధ్యంలో… వారి ఆశలను 2018వ సంవత్సరం సాకారం చేయనుంది. పూరీ జగన్నాధ్ – బాలయ్యల జోడి మాదిరే, త్రివిక్రమ్ – జూనియర్ ఎన్టీఆర్ ల జోడి కూడా ఓ డిఫరెంట్ లుక్ ను సొంతం చేసుకుంది.


