బాలీవుడ్ యాక్షన్ మూవీ వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడనే వార్త ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. డైరెక్ట్ హిందీ డెబ్యూకి ఇంతకన్నా మంచి ఛాన్స్ ఉండదని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. నిజానికి యష్ రాజ్ ఫిలింస్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, ఇద్దరు హీరోలు ఎవరి ట్విట్టర్ హ్యాండిల్స్ లోనూ దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ లేదు. కొందరు పేరొందిన ముంబై మీడియా ప్రతినిధులు, వెబ్ సైట్ల ద్వారా ఇది హఠాత్తుగా ప్రచారంలోకి వచ్చేసింది
సరే ఇది నిజమయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంతోషించాల్సిన విషయమే. కానీ తారక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. మల్టీస్టారర్స్ తో వచ్చిన అతి పెద్ద తలనెప్పి ఫ్యాన్స్ ని సంతృప్తిపరచడం. జూనియర్ తో ఉన్నంత బాండింగ్ రాజమౌళికి ఇంకెవరితోనూ లేదు కాబట్టి ఈ కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి. అయినా సరే ఆర్ఆర్ఆర్ లో కొమురం భీమ్ పాత్ర గురించి కొంత అసంతృప్తి వ్యక్తమయ్యింది. జక్కన్న చాలా క్యాలికులేటెడ్ గా స్క్రిప్ట్ రాయించి బ్యాలన్స్ చేసినా సరే ఈ ఇబ్బంది వచ్చి పడింది.
ఇప్పుడు వార్ 2 అంటే మొత్తం హిందీ బ్యాచే ఉంటుంది. మొదటి భాగంలో టైగర్ శ్రోఫ్ ఉన్నా హృతిక్ రోషనే బాగా హైలైట్ అయ్యాడు. థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అతనే ఎక్కువ గుర్తుంటాడు. ఇప్పుడీ సెకండ్ పార్ట్ లో ఆలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జూనియర్ దే. తర్వాత ప్రాధాన్యత తగ్గిందనో లేదా క్యారెక్టర్ ని సరిగా డిజైన్ చేయలేదనో కామెంట్స్ వస్తే అదింకో రచ్చకు దారి తీస్తుంది. ఇక్కడంటే ట్విట్టర్ లో తెలుగు ఫ్యాన్స్ కొట్టుకున్నారు కానీ మన భాషే రాని నార్త్ బ్యాచ్ తో ఏమని గొడవపడతారు.
కొరటాల శివతో చేస్తున్న సినిమా ఎలాగూ అంచనాలకు మించి రూపొందుతోంది. ఆ తర్వాత కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ లైన్ లో ఉన్నాడు. వీటితో ఎలాంటి చిక్కూ ఉండదు.ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం వచ్చిన మహాసంగ్రామం నుంచి ఇప్పటి ట్రిపులార్ దాకా టాలీవుడ్ లో ఎన్నో మల్టీస్టారర్స్ పూర్తిగా ఇద్దరి అభిమానులను వంద శాతం మెప్పించలేకపోయాయి. ఎవరో ఒకరిని తక్కువగా చూపించారనే నిందలు ఆయా దర్శకులు మోయాల్సి వచ్చింది. మరి జూనియర్ ఈసారి ఆ సమస్య రాకుండా చూసుకుంటాడా.



