ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో “జై లవకుశ” చిత్రంలో నటిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత నుండి క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్లుగా ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే… నెంబర్ 1 స్పాట్ లక్ష్యంగా జూనియర్ ఎన్టీఆర్ అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ సినిమాలతో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారన్న మంచి పేరును ప్రేక్షకులలో తెచ్చుకోగా, తాజాగా సెట్స్ పైన ఉన్న “జైలవకుశ”తో మరో సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడన్న టాక్ బలంగా వినపడుతోంది.
ఈ నేపధ్యంలో… వరుసగా త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల శివ దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎన్నాళ్ళ నుండో డ్రీంగా మిగిలిపోయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాకు ఈ దసరా నాడు కొబ్బరికాయ కొట్టబోతున్నారని సమాచారం. అలాగే రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ నుండి ప్రారంభించే విధంగా ప్లాన్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ తర్వాత ఏకంగా ఎస్.ఎస్.రాజమౌళితో ఎన్టీఆర్ 29వ సినిమా పట్టాలెక్కనుందని, ఆ తర్వాత కొరటాల శివ సినిమా తెరకెక్కనుందని ట్రేడ్ టాక్.
ఈ ముగ్గురు దర్శకులు కూడా ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్. అంతేగాక, ముగ్గురు మూడు విలక్షణమైన సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తులు. హృదయానికి హత్తుకునే డైలాగ్స్ తో ఫుల్ ఫ్యామిలీ అంతా సినిమాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ నేర్పరి కాగా, హీరోయిజంలో రాజమౌళిని మించిన వారు ఉండరు. ఇక సందేశాత్మకంగా కమర్షియల్ సినిమాలను అందించడంలో కొరటాలను కొట్టేవారు కూడా లేరు. దీంతో ‘బుడ్డోడు’ ప్లానింగ్ ఇతర స్టార్ హీరోలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు అన్నది అసలు విషయం.



