ఈ నెల 11న హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి రవీంద్రనాథ్ మృతి వలన ఖాళీ అయిన సీటుని భర్తీ చేయడానికి ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ సీటు గెలుచుకోవడం, కోల్పోవడం వలన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పెద్దగా తేడా ఉండదు. కనుక దీనికంత ప్రాధాన్యం ఉండకూడదు.
కానీ రెండు పార్టీలు ఈ సీటుని దక్కించుకోవడం కోసం చాలా భీకరంగా పోరాడుకొంటున్నాయి. తద్వారా ప్రజలు తమవైపే ఉన్నారని లేదా ప్రత్యర్ధి పార్టీపై తాము చేస్తున్న ఆరోపణలు నిజమేనని నిరూపించుకునేందుకు కావచ్చు. లేదా జూబ్లీహిల్స్ వంటి బలమైన నియోజకవర్గంపై పట్టు సాధిస్తే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని కావచ్చు. లేదా మరేదైనా బలమైన కారణం ఉండి ఉండవచ్చు.
కానీ రెండు పార్టీలు భారీ మెజార్టీతో గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు ఇన్ని వ్యూహాలు, ఇన్ని విమర్శలు, ఆరోపణలు, ఇంత ప్రచారం అవసరం ఉండకూడదు కదా?
పార్టీ అభ్యర్ధులు ప్రచారం చేసుకుంటే సరిపోయేదానికి, ఇటు సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బరిలో దిగగా, అటు బీఆర్ఎస్ పార్టీలో అతిరధ మహారధులు అందరూ జూబ్లీహిల్స్‌లో తిష్టవేశారు. రెండు పార్టీలు ఇది తమకు జీవన్మనరణ సమస్య అన్నట్లు చాలా భీకరంగా పోరాడుకుంటున్నాయి.
అంటే రెండు పార్టీలు ఎదురీదుతున్నాయనే కదా అర్ధం. కనుక వాటి ప్రగల్భాలకు, వాస్తవ పరిస్థితికి మద్య పెద్ద అగాధమే ఉందని భావించవచ్చు.
ఇదివరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్రతీ ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరినీ మొహరించి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుండేవారు. వాటిలో గెలిచి నాకు ఎదురేలేదనే తృప్తి కోసమే ఆయన ఆవిధంగా చేసి ఉండొచ్చు. కానీ ఓడితే ఆయనే స్వయంగా ఓడినట్లు ప్రజలు భావించేవారు.
ఉదాహరణకు ఈటల రాజేందర్‌ని ప్రభుత్వంలో నుంచి మెడ పట్టుకొని బయటకు గెంటేసిన తర్వాత అయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చింది.
ఈ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ని ఓడించి రాజకీయంగా భూస్థాపితం చేయాలనుకున్నారు. కనుక అందరినీ మొహరించి సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. కానీ చివరికి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. దాంతో కేసీఆరే ఆ ఎన్నికలలో ఓడిపోయారనే భావన ప్రజలకు కలిగింది.
ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ కూడా ఈ ఉప ఎన్నికలో అదే చేస్తున్నారు. కనుక ఈ ఉప ఎన్నికలలో గెలిస్తే వారికి ఒరిగేదేమీ ఉండక పోవచ్చు. కానీ ఏ పార్టీ ఓడినా ఆ అప్రదిష్ట వారి మెడకే చుట్టుకోవడం ఖాయం.




