తెలంగాణలో త్వరలో జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరుకి అటు అధికార కాంగ్రెస్ సిద్దమవ్వగా ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ సై అంటుంది. మరి తెలంగాణలో అధికారమే మా లక్ష్యం అంటూ ప్రకటనలు చేసే బీజేపీ మాత్రం ఉప ఎన్నికల పోరులో పూర్తిగా వెనుకబడింది.
కాంగ్రెస్, నవీన్ యాదవ్ తో బరిలో దిగుతుంటే, బిఆర్ఎస్ మాగంటి సునీతా తో పోరుకి సిద్దమయ్యింది. ఇక బీజేపీ లంకల దీపక్ రెడ్డి తో అదృష్టం పరీక్షించుకోనుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఎన్నికల పోరులో కాంగ్రెస్ – బిఆర్ఎస్ లు హోరాహోరీగా ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
అయితే బీజేపీ మాత్రం గోడ మీద పిల్లి మాదిరి చడీచప్పుడు లేకుండా ఈ ఇరు పార్టీల పోరును తీక్షణంగా పరిశీలిస్తుంది. బీజేపీ టార్గెట్ అధికారమా.? లేక సహకారమా.? అన్న స్పష్టత ఇప్పటికి అటు జూబ్లీహిల్స్ ఓటర్లకు గాని ఇటు టి.బీజేపీ క్యాడర్ కి గాని లేకపోవడం గమనార్ధం.
అధికార కాంగ్రెస్ బిఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కయ్యింది అంటూ ఆరోపిస్తుంది, ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ తో టి.బీజేపీ బడా నాయకులు తెరచాటు రాజకీయం చేస్తూ బిఆర్ఎస్ ఓటమి కోసం శ్రమిస్తున్నారు అంటూ ఎదురుదాడి చేస్తుంది.
అయితే ఈ ఇరు పార్టీల వాదనలో ఎంత మేరకు వాస్తవం ఉంది అనేది పరిశీలిస్తే, ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి నడుస్తున్న బీజేపీ తెలంగాణ విషయానికొచ్చే సరికి ఆ కూటమికి ససేనా నో అంటుంది. తెలంగాణలో టీడీపీ పొత్తుని కానీ జనసేన స్నేహాన్ని కానీ వద్దనుకుంటున్న బీజేపీ ఎవరితో కలిసి నడవాలని భావిస్తుంది.
ఏపీలో ఈ కూటమి ఫార్ములా బీజేపీ ని అధికారంలోకి తెచ్చింది, ప్రభుత్వంలో భాగం చేసింది. అయినా కూడా బీజేపీ కూటమి ఏర్పాటుకు నో చెపుతుంది, అంటే తెలంగాణలో బీజేపీ వేరొకరితో కలిసి నడవాలని ఆశ పడుతుందా.? ఆ నడకకు ఈ కూటమి పార్టీలు అడ్డుతగులుతాయని భయపడుతోందా.?
లేక తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదగాలని ఉత్సహపడుతుందా.? అయితే సౌత్ ఇండియాలో అందునా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ కి సొంత బలం అనేది సాధ్యమయ్యే పనేనా.? ఇన్నేళ్ల బీజేపీ ప్రయత్నాలు కనీసం పార్టీని రెండవ స్థానానికి కూడా తీసుకురాలేకపోయింది.
అలాంటిది తెలుగు రాష్ట్రాలలో ఒంటరిగా బీజేపీ అధికారంలోకి రావడం అంటే దేశంలో కాంగ్రెస్ సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే అవుతుంది. అక్కడ అది సాధ్యం కాదు ఇక్కడ ఇది వర్క్ అవుట్ అవ్వదు. అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల విషయానికొస్తే బీజేపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి సామజిక వర్గానికి చెందినవాడు.
ఆ సామజిక వర్గం ఓటు బ్యాంకు సహజంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటుంది. ఇది బిఆర్ఎస్ కు రాజకీయ లబ్దిని చేకూరుస్తుంది. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ను చిల్చడానికే దీపక్ రెడ్డి కి అవకాసం ఇచ్చిందా.? అన్న అనుమానులు తలెత్తున్నాయి. దీనితో బీజేపీ టార్గెట్ అధికారమా.? సహకారమా.? అన్న చర్చ ఊపందుకుంది.







