జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఉభయగోదావరి జిల్లాలలో వారాహి వాహనంలో యాత్ర మొదలుపెట్టారు. కనుక వైసీపీ లోపలా, బయటా ఆయన కోసం కేటాయించిన బ్యాచ్ యాక్టివ్ అయ్యారు. పవన్ కళ్యాణ్‌కు అసైన్ చేసినవారిలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకరు కనుక ఆయన స్పందిస్తూ, “అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు యాత్ర చేస్తున్నారో ఆయనకైనా తెలుసో తెలియదో?నిర్ధిష్టమైన రాజకీయ లక్ష్యం ఏదీ లేకుండానే చంద్రబాబు నాయుడుని గెలిపించేందుకు ఆయన కష్టపడుతున్నారు. అయితే ఎన్ని పార్టీలు కట్టకట్టుకొని వచ్చినా, వైసీపీని ఎదుర్కొని నిలబడలేరు. నాలుగేళ్ళుగా సంక్షేమ పధకాలతో ప్రతీ ఇంటికీ మేలు చేస్తున్న సిఎం జగన్‌ను కాదని ప్రజలు వారికి ఓట్లు వేయరు. ఈసారి 175 సీట్లు మేమే గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తాము,” అని అన్నారు.
సాధారణంగా మనుషులు దేనిని చూసి భయపడతారో తరచూ దాని గురించే ఆలోచిస్తుంటారు. ఉదాహరణకు అలనాడు ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువును భక్తితో ప్రార్ధిస్తుంటే, అతని తండ్రి హిరణ్యకశిపుడు కూడా ఎల్లప్పుడూ శ్రీమహావిష్ణువు గురించే ఆలోచిస్తుండేవాడు జయించాలనే ఆలోచనతో లేదా జయించలేనేమో అనే భయంతో!
అలాగే వైసీపీ నేతలు కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లనే తలుచుకొంటుంటారు. అది భక్తితో కాదని అందరికీ తెలుసు.
పవన్ కళ్యాణ్‌కు అసైన్ చేయబడిన వారిలో ప్రజాశాంతి అధ్యక్షుడు కెఏ పాల్ కూడా ఒకరు. ఆయన రాజకీయాలలో రాణించలేకపోతున్నప్పటికీ, ఎల్లప్పుడూ హాట్ హాట్‌గా సాగే రాజకీయాలలో తనదైన శైలిలో కామెడీ పండిస్తూ అందరినీ కాస్త రిలాక్స్ అయ్యేలా చేస్తుంటారు.
ఇప్పుడు ఆయనకు ‘పవన్ కళ్యాణ్-డ్యూటీ’ పడింది కనుక మీడియా ముందుకు వచ్చి ఎవరికీ తెలియని ఓ భయానక రహస్యం బయటపెట్టారు. ఇంతకీ ఆయనేమన్నారంటే, “పవన్ కళ్యాణ్‌కి ప్రాణహాని ఉంది. ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారో వారి వలననే అంటే… చంద్రబాబు నాయుడు వలననే ప్రాణహాని పొంచి ఉంది. ఎన్నికలలో సానుభూతి ఓట్ల కొరకు చంద్రబాబు నాయుడే ఆయనను లేపించేసి, ఆ హత్యానేరం సిఎం జగన్మోహన్ రెడ్డిమీదకు నెట్టేయడానికి ప్రయత్నించవచ్చు. కనుక పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం,” అని కెఎ పాల్ హితవు పలికారు.
ఎల్లప్పుడూ ఆ ఏసు ప్రభువు సేవలో ఉంటానని చెప్పుకొనే కెఎ.పాల్‌కు ఇటువంటి భయంకరమైన ఆలోచనలు ఎలా కలుగుతాయో తెలీదు. ఆయన రాజకీయాలలో రాణించలేకపోతున్నా, ఏపీ రాజకీయాలను బాగానే వంటపట్టించుకొన్నారని అర్దమవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా వారాహి వాహనం ఎందుకు తయారుచేయించుకొన్నారో బహుశః ఆయనకు తెలుసో తెలియదో?



