కొత్తగా వ్యాపారం మొదలుపెట్టేవారు ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడి దానిని విజయవంతం చేస్తారు. కానీ వారసులు లేకపోతే వారి కష్టం ఈనగాచి నక్కలు పాలయినట్లే. రాజకీయాలలో కూడా అంతే!
ఓ నియోజకవర్గంలో టికెట్ సాధించి ఎన్నికలలో గెలిచిన తర్వాత లేదా ఓ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత, వారసులు లేకపోతే ఆ సీటు లేదా పార్టీని వేరెవరికో అప్పజెప్పాల్సి వస్తుంది లేదా ఎవరో దానిని కాజేస్తారు. కనుక రాజకీయాలలో కూడా వారసులు అవసరమే.
ఏనుగు బ్రతికినా చచ్చినా విలువ మారదన్నట్లు ఓ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయినా దాని మార్కెట్ విలువ కాస్త తగ్గుతుందేమో కానీ పూర్తిగా జీరో అవదు.
కల్వకుంట్ల కవిత పరిస్థితి కూడా ఇదే! బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత ఆమె మళ్ళీ ఏబీసీడీల నుంచి మొదలుపెట్టక తప్పడం లేదు.
తెలంగాణ రాజకీయాలలో ఒంటరి పోరాటాలు చేస్తున్న ఆమె వెనుక అనామకులే తప్ప ప్రజలకు పరిచయమున్న మొహాలు ఒక్కటి కూడా కనపడటం లేదు. కనుక తనను తానే ప్రమోట్ చేసుకోవలసి వస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో ఆమె కుమారుడు ఆదిత్య ఎంట్రీ ఇచ్చాడు!
విదేశాలలో చదువుకుంటున్న ఆదిత్య ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు. బీసీ రిజర్వేషన్స్ కోసం నేడు తెలంగాణ బంద్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్వర్యంలో నేడు హైదరాబాద్, ఖైరతాబాద్ జంక్షన్ వద్ద మానవహారం కార్యక్రమం చేపట్టారు.
దానిలో ఆదిత్య కూడా పాల్గొని ప్లకార్డు పట్టుకొని బీసీ రిజర్వేషన్స్ ఇవ్వాలని నినాదాలు చేశాడు. బీసీల కోసం తన తల్లి చేస్తున్న పోరాటంలో రాష్ట్రంలో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశాడు.
ఆదిత్య చదువులు ఇంకా పూర్తి కాలేదు. బీసీ రిజర్వేషన్స్ కధా కమామిషు గురించి అతనికి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. కనుక ఇది సినిమాలలో బాల నటుడి ప్రవేశం వంటిదేనని భావించవచ్చు.
కానీ భవిష్యత్తులో మావయ్య కేటీఆర్‌లాగే ఆదిత్య కూడా రాజకీయాలలో ప్రవేశించవచ్చు. ఆలోగా కల్వకుంట్ల కవిత రాజకీయంగా స్థిరపడితే ఆమె రాజకీయ వారసుడుగా ఆదిత్య కూడా తన అదృష్టం పరీక్షించుకోవచ్చు.




