పార్టీ గెలిచినప్పుడు కారణాలు చెప్పాల్సిన పని ఉండదు. అలాగే పార్టీ ఓడినప్పుడు మాత్రం కారణాలు వెతకాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అదే వెతుకులాటలో ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు. తప్పెక్కడ జరిగింది.ప్రతిపక్ష పార్టీకి ఎక్కడ అవకాశం ఇచ్చాము అంటూ అంతర్మధనం చేసుకుంటున్నారు బిఆర్ఎస్ నేతలు.
ఫామ్ హౌస్ సీఎం గా పేరుపొంది పదేండ్ల అధికార అహంతో ఎవరినైనా ఎదురిస్తా.., ఎవరినైనా ఓడిస్తా..,ఎవరినైనా నిందిస్తా అంటూ ఒంటెద్దు పోకడలతో కేసీఆర్ ఒకపక్క, బాబు అరెస్టు సందర్భంలో అనవసరమైన ప్రకటనలు చేసి కేటీఆర్ మరో పక్క, ముఖ్యమంత్రి కూతురిగా, ఎంపీ గా బాధ్యతగా వ్యవహరించాల్సిన కవిత లిక్కర్ స్కాం అంటూ ఆరోపణలు ఎదుర్కోవడం ఇలా పార్టీకి బలమనుకున్న వారే పార్టీ బలహీన పడడానికి కూడా కారణంగా నిలిచారు.
ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాములో కవిత పాత్ర అంటూ నిత్యం మీడియాలో కథనాలు రావడం,వాటిని అధికార పార్టీ నేతలెవ్వరు ఖండించకపోవడం,బిఆర్ఎస్ పెద్దలు బీజేపీ తో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్న కారణంగానే కవిత అరెస్టు కాకుండా ఆగింది అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు అన్ని ప్రజలలోకి బలంగా వెళ్లాయి. ఎన్నికల ముందు కేటీఆర్ పలు టీవీ ఛానెల్స్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూలలో కూడా కవిత మీద వచ్చిన ఆరోపణలకు ఎక్కడా వివరణ ఇవ్వలేదు, అలా అని కండించనూలేదు.
మోనం అర్దాంగికారం అన్నట్లుగా ప్రజలు భావించి ఉండవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురయ్యి ఉండి జాతీయ స్థాయిలో స్కాములు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కోవడం, విచారణకు హాజరుకావడం, ప్రజలకు సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఢిల్లీలో చేసిన స్కాం గల్లీలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు పై ప్రభావం చూపించింది. ఇలా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా సొంత కుటుంబ సభ్యులే సొంత పార్టీని తలో చెయ్యి వేసి ప్రస్తుతానికి రాష్ట్రంలో బొందపెట్టుకున్నారు.
ఎంత అభివృద్ధి చేసినా, ఏన్ని ఉచిత పథకాలు ఇచ్చినా ప్రజలు మార్పు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మార్పు తీసుకువస్తారు అనేది మరోసారి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో రుజువయ్యింది.




