బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం నుంచి రాబోయే నాయకత్వం వరకు అందరి పై ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేసి కేసీఆర్ ఆగ్రహానికి, కేటీఆర్ అధికారానికి, హరీష్ అనుబంధానికి బలై చివరికి పార్టీ నుండి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చారు కవిత.
అయితే నాటి నుంచి తెలంగాణ రాజకీయాలలో ఒంటరి పోరాటం చేస్తున్న కవిత ముఖ్యంగా బిఆర్ఎస్ ముఖ్యనాయకుడు, కేసీఆర్ కుటుంబానికి బంధువైన హరీష్ రావు ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేసింది. హరీష్ బిఆర్ఎస్ కు కోవర్ట్, కేసీఆర్ కి కట్టప్ప అంటూ చాల తీవ్రమైన ఆరోపణలు చేసింది.
అయితే కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు బిఆర్ఎస్ నేతల నుంచి క్యాడర్ వరకు ప్రతి ఒక్కరు హరీష్ ఆరడుగుల బుల్లెట్ అంటూ ఆయనకే మద్దతుగానే నిలిచారు. దీనితో కవిత ఆవేశం ఆమెని రాజకీయంగా ఒంటరిగా మార్చేసింది, గులాబీ కారును దూరం చేసింది.
అయితే ఈ రోజు ఉదయం హరీష్ రావు తండ్రి సత్యనారాయణ కాలం చేసారు. పితృ వియోగంతో బాధపడుతున్న హరీష్ రావు కి మద్దతుగా కేసీఆర్ కుటుంబం మొత్తం ఉదయం నుంచి హరీష్ వెంట నిలబడింది. అయితే హరీష్ తండ్రి కేసీఆర్ కి బావ వరస అవుతారు, అంటే సత్యనారాయణ కేటీఆర్, కవితకు మామ లెక్క.
మామ అంతిమ చూపు చూడడానికి కూడా కవిత హరీష్ ఇంటికి వెళ్లలేదని, హరీష్ ని పరామర్శించలేదని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనితో రాజకీయాలు వేరు కుటుంబ బంధాలు వేరు అనే చిన్న గీతను కవిత చెరిపేశారా.? రాజకీయాల కోసం కవిత రాజీ లేని పోరాటానికి సిద్దపడ్డారా.? అంటూ కవితను అనేక ప్రశ్నలు చుట్టూముడుతున్నాయి.
కవిత ఆవేశం రాజకీయంగానే కాదు కుటుంబ పరంగా కూడా కవితను ఒంటరిని చేస్తుంది. చావుల దగ్గర కూడా రాజీ లేని రాజకీయాన్ని ప్రజలు హర్షిస్తారా.? కవిత చర్యలను స్వాగతిస్తారా.? అన్నది కవిత గ్రహించాలి.
అయితే ఈ విషయంలో కవిత ముందుకు వెళ్లలేకపోతుందా.? లేక వెళ్లకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా.? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక రాజకీయాలు – బంధాలు అనే రెండు కూడా ఒకే త్రాసులో ఎప్పటికి తూగలేనవి రాజకీయ నాయకులు గుర్తించాలి.




