తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెలాఖరు నుంచి ‘జాగృతి జనం బాట’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఈ మేరకు నేడు హైదరాబాద్‌లో పోస్టర్ విడుదల చేశారు. దానిలో తండ్రి కేసీఆర్ ఫోటో మిస్సింగ్! ఆ స్థానంలో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి ఫోటోలు పెట్టుకున్నారు.
స్వయంగా తండ్రి, అన్న నడిపిస్తున్న సొంత పార్టీలోనే తనకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన అర్ధం చేసికోవచ్చు. కానీ పార్టీలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడకుండా, ఇప్పుడు మాట్లాడితే అది తన రాజకీయ మనుగడ కోసం లేదా అందరి మద్దతు కూడగట్టుకొని రాజకీయంగా ఎదిగేందుకనే అనుకోవాల్సి ఉంటుంది.
ఇదివరకు జగన్, షర్మిల కూడా తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నప్పుడు ఇలాగే మద్దతు కూడగట్టుకున్నారు. కానీ తర్వాత ఇద్దరూ తమని నమ్ముకొని వెంట తిరిగినవారిని నడిరోడ్డున వదిలేసి ఏపీకి వచ్చేశారు.
రేపు తండ్రి పిలిస్తే కవిత కూడా ఇలాగే చేయరనే నమ్మకం ఏమిటి? అప్పుడు ఈ సామాజిక తెలంగాణ సంగతి ఏమవుతుంది?
బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడినప్పటికీ, తెలంగాణ రాజకీయాలలో గట్టిగా నిలబడి తన సత్తా చాటుకోవాలని కవిత అనుకోవడం చాలా అభినందనీయం. కానీ అందుకు ఆమె ఎంచుకున్న మార్గమే సరికాదు.
ఆమె సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని దాంతో ఎన్నికలకు వెళ్తామని చెపితేనే రాజకీయ నాయకులైనా, ప్రజలైనా ఆమె మాటలను నమ్ముతారు. కానీ కవిత తనకు ఆ ఉద్దేశ్యమే లేదనట్లు తెలంగాణ జాగృతి పేరుతో సామాజిక తెలంగాణ సాధన కోసం బయలుదేరుతున్నారు.
జాగృతి జనం బాట బ్యానర్లలో, జాగృతి కండువాలపై తండ్రి కేసీఆర్ ఫోటోలు తొలగించారు. కనుక సొంతంగా గుర్తింపు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారని అర్ధమవుతోంది. కానీ ఆమె తన పేరులో ‘కల్వకుంట్ల’ కూడా తొలగించుకోవాలి కదా?
కానీ ఆ బ్రాండ్ ఇమేజ్ వదులుకోకుండా, నేటికీ అదే గుర్తింపుతో తిరిగితే ఆమెకు సొంత గుర్తింపు ఎలా వస్తుంది? ప్రజలు, రాజకీయ నాయకులు ఆమెను కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలుగానే చూస్తారు తప్ప వేరేగా ఎలా చూస్తారు? వేరుకాదని భావిస్తే ఆమె మాటలను ఎందుకు నమ్ముతారు?
ప్రజల నమ్మకం పొందలేనప్పుడు రాజకీయాలలో ఎలా రాణించగలరు? కనుక కవిత డబ్బు, కాళ్ళు అరగదీసుకునే ముందు ఈ మార్పులు చేసుకోవడం చాలా అవసరం. లేకుంటే ఆమె కధ కూడా షర్మిల కధలాగే సాగుతుంది.




