కల్వకుంట్ల కవితపై వేటుకు వేళాయేనా?

Kavitha Slams BRS, Sparks Political Storm

ఒకప్పుడు బీఆర్ఎస్‌ పార్టీలో యువరాణిలా ఓ వెలుగు వెలిగిన కల్వకుంట్ల కవిత, అమెరికా ప్రయాణం చేసొచ్చిన ప్రతీసారి పార్టీకి దూరమవుతుండటం విశేషం.

నిన్న అమెరికా నుంచి హైదరాబాద్‌లో దిగుతూనే బీఆర్ఎస్‌ పార్టీ మీద బాంబుల వర్షం కురిపించారు. మా డాడీ దేవుడు… హిమాలయాలంత ఎత్తైన వ్యక్తిత్వం ఉన్నవాడు… ఆయనకు తెలంగాణ ధ్యాస తప్ప డబ్బు ధ్యాస లేనే లేదు.

ADVERTISEMENT

అటువంటి నిష్కళంక చరిత్ర కలిగిన కేసీఆర్‌కి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ అవినీతి మరకలు అంటించారు. అయినా అయన దేవుడులా వారిని క్షమించి వెంట తిప్పుకుంటుంటే ఇద్దరూ కలిసి ఆయనని నిలువునా ముంచేశారు.

విశ్వాస ఘాతుకానికి పాల్పడి ఇప్పుడు సీబీఐ విచారణ కూడా ఎదుర్కోక తప్పని పరిస్థితి కల్పించారు. ఇటువంటి వాళ్ళు పార్టీకి అవసరమా? అందరూ ఆలోచించాలి.

ఇంత జరిగిన తర్వాత బీఆర్ఎస్‌ పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత? నా తండ్రి మీద ఈగవాలినా నేను సహించను. సీబీఐ విచారణ జరిపినా కేసీఆర్‌ కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తారు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.

ఆమె తండ్రిని వెనకేసుకువస్తూ ఆయన మీద ఈగ కూడా వలనీయనని చెపుతూనే ఆయనకు అవినీతి మరకలు అంటుకున్నాయని, తన ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నా చూసీ చూడనట్లు ఊరుకున్నారంటూ మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ధ్రువీకరించారు.

ఈ కేసులో ఆయన కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తారంటే అరెస్ట్‌ తప్పదని చేపుతున్నట్లే ఉంది.

కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఆమె మాట్లాడిన ఈ మాటలనే చెపుతూ “ఇంకా రాజకీయ కక్ష, కేసీఆర్ ప్రతిష్ట దెబ్బ తీయడం అంటూ బొలిబొలి ఏడ్పులు దేనికి?

అవినీతికి పాల్పడకపోతే కేసీఆర్‌ ధైర్యంగా సీబీఐ పిలిస్తే వెళ్ళి కడిగిన ఆణిముత్యంలా బయటకు రావచ్చు కదా?” అని ఎద్దేవా చేస్తున్నారు.

కల్వకుంట్ల కవిత పార్టీకి మూలస్థంభం వంటి హరీష్ రావు గురించి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత, నిన్న రాత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌసులో జరిగిన సమావేశంలో హరీష్ రావు కూడా హాజరయ్యారు. అంటే ఆయన హరీష్ రావువైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టమైంది.

కనుక ముందుగా ఆమె మాటలతో దెబ్బతిన్న హరీష్ రావు ప్రతిష్టను, ఆత్మగౌరవాన్ని అత్యవసరంగా పునరుద్దరించవలసి ఉంటుంది. లేకుంటే పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఇంకా పెరిగిపోతుంది.

ఒకవేళ ఈ మాటలను కేసీఆర్‌ ఖండించకపోతే ఆయన నొచ్చుకొని జంప్ అయితే బీఆర్ఎస్‌ పార్టీ కుప్ప కూలిపోతుంది. కనుక కూతురు కవితపై వేటు వేయక తప్పదు. అది నేడా రేపా? అనేది మాత్రమే నిర్ణయించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories