హరీష్ రావు భార్యకు సవాల్ విసిరిన కవిత…

Kavitha targets Harish Rao in Telangana political rivalry

బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అసలు కవిత బిఆర్ఎస్ కు దూరం కావడానికి ఆమె చేసుకున్న స్వయంకృతాపరాధమే కారణమా.? లేదా కవిత ఆరోపిస్తున్నట్టుగా హరీష్ నడుపుతున్న తెరవెనుక రాజకీయం కారణమా.? అన్నది ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఏది ఏమైనా కవిత రాజకీయ జీవితంలో మంచో, చెడో జరగాల్సింది జరిగిపోయింది. అయితే అసలు అలా జరగడానికి హరీషే కారకుడు అంటూ కవిత ఇంకెన్నాళ్లు హరీష్ టార్గెట్ గా రాజకీయం చేస్తారు.? ఆయన పై అవినీతి ఆరోపణల నుంచి క్షుద్ర పూజల వంటి అసాంఘిక కార్యక్రమాల విమర్శల వరకు కవిత ఎక్కడ తగ్గేదెలా అన్నట్టుగా హరీష్ పై రెచ్చిపోతూనే ఉన్నారు.

ADVERTISEMENT

కేవలం ఇటు రాజకీయ విమర్శలతోనే సరిపెట్టకుండా అటు రాజకీయ పోరాటాల వరకు కవిత హరీష్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెరాస పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత హోదాలో తానూ హరీష్ నియోజకవర్గమైన సిద్ధిపేట నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానంటూ హరీష్ పై రాజకీయ యుద్దానికి సై అంటూ కాలు దువ్వుతున్నారు.

సిద్దిపేటలో హరీష్ ని కాదని అక్కడ ప్రజలు మరో వ్యక్తికీ పట్టం కడతారా అంటే దానికి సమాధానం కేసీఆర్ కుమార్తెగా కవితకు తెలిసిన విషయమే. అయినా కూడా కవిత పదేపదే హరీష్ ను ఎందుకు రెచ్చకొడుతున్నారు.? తాజాగా మీడియా ముందుకొచ్చిన కవిత ఈసారి హరీష్ రావు సతీమణి ని కూడా తన రాజకీయం లోకి లాగారు.

గతంలో చెప్పినట్టే అయితే సిద్ధిపేట లేకుంటే బోధన నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని, దమ్ముంటే తన పై పోటీ చేసేందుకు హరీష్ తన సతీమణి ని బరిలోకి దింపాలని, తన పై ఎవరు పోటీ చేసినా అందుకు తాను స్వాగతిస్తామని, అయితే హరీష్ నేరుగా తనను ఎదుర్కోలేక తెరవెనుక రాజకీయం చేస్తున్నారని,

తనకు బదులు తన భార్యను తన పై పోటీకి దింపినా అందుకు తానూ సిద్దమే అంటూ మరోమారు హరీష్ ను టార్గెట్ చేసారు కవిత. హరీష్ పై కవిత విమర్శలు నానాటికి పరిధి దాటుకుంటూ దూకుడుగా ముందుకెళుతున్నాయి. కోవర్ట్, కట్టప్ప తో మొదలైన విమర్శలు గుంటనక్క వరకు వెళ్లి చివరికి ఆ రాజకీయం ఇప్పుడు హరీష్ ని దాటుకుని ఆయన సతీమణి వరకు వ్యాపించింది.

మరి ఇప్పటికైనా హరీష్ కవిత దూకుడుకి కళ్లెం వేయగలరా.? లేదా కవిత రాజకీయాన్ని ఆటలో అరటి పండు మాదిరి పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఎన్నికల కురుక్షేత్రంలోనే ఆమె దూకుడుకి చెక్ పెడతారా.?

ADVERTISEMENT
Latest Stories