కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో చాలామంది తనతో టచ్‌లో ఉన్నారని చెప్పుకున్నప్పటికీ ఆమె వెంట నడిచేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఆమె రాజకీయాలలో కొనసాగేందుకు తెలంగాణ జాగృతి తాత్కాలికంగా ఓ వేదికగా ఉపయోగపడుతున్నప్పటికీ అది శాశ్విత ఏర్పాటు కాదు.
అలాగని ఆమె సొంతంగా పార్టీ స్థాపించి నడిపించడం తలకు మించిన భారమే అవుతుంది. ఆమె కాంగ్రెస్, బీజేపిలో చేరాలనుకోవడం లేదు. కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత ఆమె రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని చెప్పక తప్పదు.
ఈ పరిస్థితిలో ఆమెకు రెండు రాజకీయ అవకాశాలు వచ్చాయి. 1. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేయడం లేదా తన అభ్యర్ధిని బరిలో దించి గెలిపించుకోవడం. 2. స్థానిక సంస్థల ఎన్నికలలో తన అభ్యర్ధులను బరిలో దింపి గెలిపించుకోవడం.
కానీ ఈ రెండు ఎన్నికలకు ఆమె దూరంగా ఉండబోతున్నట్లు సూచన ప్రాయంగా తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎవరు పోటీ చేసి గెలిచినా, ఏ పార్టీకి పెద్ద తేడా ఏమీ ఉండదు. కనుక ఉప ఎన్నికల కంటే బీసీ రిజర్వేషన్స్ కోసం పోరాడటమే ముఖ్యమని భావిస్తున్నాను,” అని అన్నారు.
ఆమెకు చెప్పుకోవడానికి కనీసం ఓ రాజకీయ పార్టీ కూడా లేదు. కనుక ఆమె బీసీ రిజర్వేషన్స్ లేదా మరే సమస్యపై పోరాటాలు చేసినా ఆమెకు ఎటువంటి ప్రయోజనమూ ఉండకపోవచ్చు.
మళ్ళీ తండ్రి లేదా అన్న కరుణించి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే తప్ప ఆమె తెలంగాణ రాజకీయాలలో ఒంటరిగా మనుగడ సాగించడం చాలా కష్టమే.




