బిఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన కవిత జాగృతి బలోపేతానికి, తన రాజకీయ ఎదుగుదలకు ఒక్కో అడుగువేస్తూ ముందుకెళ్తుంది. అయితే కవిత వేసే ఒక్కో ముందడుగు ఆ ఇద్దరి పతనానికేనా అన్న చర్చ జరుగుతుంది.
బిఆర్ఎస్ నుంచి తానూ సస్పెన్షన్ వేటు తో బయటకు రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ ఇద్దరే కారణమని కవిత బలంగా విశ్వసిస్తున్నారా అంటే ఆమె చేసే వ్యాఖ్యలు, కొన్ని రాజకీయ ప్రకటనలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తుంది.
కేసీఆర్ కుమార్తెగా బిఆర్ఎస్ పార్టీలో కవితకు దక్కాల్సిన సమ ప్రాధాన్యత కవిత కు దక్కకపోవడం వెనుక వారిద్దరి పాత్ర ఉందా.? అందుకే కవిత ఆ ఇద్దరే టార్గెట్ గా తన అడుగులు వేస్తుందా.? అలాగే తానూ బిఆర్ఎస్ కి దూరమవడానికి, కేసీఆర్ కి విరోధిగా మారడానికి కూడా ఆ ఇద్దరే కీలకమనే భావనలో కవిత ఉన్నారా.?
వారిలో ఒకరు అన్న కేటీఆర్ అయితే మరొకరు బావ హరిషా.? కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ బలోపేతం అవ్వడం, కేసీఆర్ కుడి భుజంగా, బిఆర్ఎస్ అదనపు బలంగా హరీష్ బలపడడం పార్టీలో కవిత ప్రాధాన్యాన్ని తగ్గించింది అనే భావన కవితలో బలంగా పాతుకుపోయిందా.? ఆ భావనే ఇప్పుడే ఆక్రోశంగా బయటకొస్తుందా.?
కవిత జాగృతి కండువా వేసుకుని మీడియా ముందుకొచ్చింది మొదలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హరీష్ టార్గెట్ గా కేటీఆర్ కి తగిలేలా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ పేరు అడ్డుపెట్టుకుని హరీష్ తన ఇంటిని బంగారం చేసుకున్నారని,
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ లో నీటి కంటే కూడా హరీష్ అవినీతే ఎక్కువగా పారిందని, కేసీఆర్ కి అవినీతి మరకలు అంటించిన క్రిడిట్ కూడా హరీష్ కే దక్కిందంటూ హరీష్ ని బిఆర్ఎస్ కోవర్డ్ గా, కేసీఆర్ కట్ఠప్ప గా అభివర్ణించడంతో పాటు హరీష్ ని గుంటనక్క అంటూ కూడా తూలనాడుతున్నారు కవిత.
ఇక కేటీఆర్ విషయానికొస్తే, పార్టీలో తన పై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, పార్టీలో తనను అణచివేసేందుకు కొందరు పావులు కదుపుతున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కి తన ఆవేదన చెప్పేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వలేదనే అక్కసు ఇప్పుడు బయటపెడుతున్నారు కవిత.
అలాగే తన అరెస్టు సమయంలో కూడా పార్టీ నుండి తనకు దక్కాల్సిన మద్దతు కానీ పార్టీ నాయకత్వం నుండి తనకు రావాల్సినంత నైతిక సపోర్ట్ కానీ దక్కలేదని, ఇక తానూ పార్టీ నుండి బయటకొచ్చిన తరువాత తన పై బిఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాలు తనను బాధించాయనేది కవిత ఆవేదనగా చెప్పుకొచ్చారు.
అయితే పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ మొత్తం కేటీఆర్ హయాంలోనే ఉండడంతో కవిత చేస్తున్న ఈ ఆరోపణలన్ని కూడా కేటీఆర్ ని గురి పెట్టాయనేది తెలుస్తుంది. ఇక తనకు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి పై ఆశ ఉందని, ఏదొకనాటికి ఆ ఆశను నెరవేర్చుకుంటా అంటూ కవిత చేసిన ప్రకటన కూడా పరోక్షంగా కేటీఆర్ ని ఉద్దేశించినదే.
ఎందుకంటే బిఆర్ఎస్ భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా, కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ అనధికారికంగా నియమితం అయిపోయారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ లో తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాసం పూర్తిగా మూసుకుపోవడానికి కూడా కేటీఆర్ ప్రధాన కారణం. దీనితో కవిత అటు హరీష్ టార్గెట్ గా ఇటు కేటీఆర్ ని ఇరుకున పెట్టేలా రాజకీయ అడుగులు వేస్తున్నారు.
ఇక తాజాగా మరోసారి కేటీఆర్ టార్గెట్ గా కవిత బిఆర్ఎస్ ని రెచ్చకొట్టే ప్రయత్నం చేసారు. సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లా చెయ్యాలంటూ కేటీఆర్ రేవంత్ సర్కార్ పై చేస్తున్న రాజకీయ ఒత్తిడి పై కూడా కవిత స్పందించారు.
పదేళ్లు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు కోసం పోరాడిన వారందరిని అణిచివేసి ఇప్పుడొచ్చి ఆ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు.






