బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ చూసిన తర్వాత మహిళలు ఎంత తెలివైనవారైనా ఎంత శక్తివంతులైనా రాజకీయాలలో రాణించకుండా అడ్డుకునే ‘దెయ్యాలు’ చాలానే ఉంటాయని స్పష్టం అవుతోంది.
జయసుధ, జయప్రద, విజయశాంతి, విజయమ్మ, వైఎస్ షర్మిల తాజాగా కల్వకుంట్ల కవిత తదితరులు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నారు.
వారితో బాటు రాజకీయాలలో ప్రవేశించినవారు, వారి తర్వాత ప్రవేశించిన పురుషులు చాలా ఉన్నతస్థాయి ఎదిగిపోయారు. కానీ మహిళా రాజకీయనాయకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నారు లేదా రాజకీయాలలో వెనుకబడిపోయి కేవలం ఉనికి చాటుకుంటూ మిగిలిపోతున్నారు.
కల్వకుంట్ల కవిత తన తండ్రి పార్టీలోనే ఉన్నప్పటికీ, ఆమె తెలివితేటలు, వాక్చాతుర్యం, రాజకీయాలపై పట్టు ఉన్నాయి. చట్ట సభలలో మహిళలకు 36 శాతం రిజర్వేషన్స్ కోసం ఆమె పోరాడారు కూడా. కానీ సొంత పార్టీలోనే ఆమెను రాజకీయంగా ఎదగనీయలేదు. గతంలో ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి పదవి తృటిలో చేజారిపోవడానికి ఇదే కారణమనిపిస్తుంది. ఇన్నేళ్ళు బిఆర్ఎస్ పార్టీలో ఇంత చురుకుగా ఉన్న తర్వాత చివరికి ఎమ్మెల్సీగా మిగిలిపోవడం, అయినా పార్టీలో సముచిత గౌరవం, ప్రాధాన్యం లభించడం లేదని ఆమె నోటితోనే చెప్పుకున్నారు.
సొంత తండ్రి అధ్యక్షుడుగా, సొంత అన్న వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న బిఆర్ఎస్ పార్టీలోనే కల్వకుంట్ల కవిత రాజకీయంగా అవరోధాలు ఎదుర్కొంటూ ఎదగలేకపోతున్నారంటే అది ఆమె తప్పు కాదు.. రాజకీయాలలో పురుషాధిపత్యం కొనసాగుతుండటమే కారణమనినిపిస్తుంది.
కనుక కల్వకుంట్ల కవిత కూడా సొంత కుంపటి పెట్టుకొని తెలంగాణ రాజకీయాలలో మరో షర్మిలగా మిగిలిపోతారా లేక బీజేపిలో చేరి విజయశాంతిలా (కాంగ్రెస్ ఎమ్మెల్సీ)గా సర్దుకుపోతారా?అనేది చూడాలి.




