గ్రేటర్ ఎన్నికల తర్వాత సిఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి బిఆర్ఎస్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోవాలని తనను అడిగారని, కానీ తాము నిరాకరించామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పడాన్ని మంత్రి కేటీఆర్ ఖండిస్తూ పెద్ద ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు బిఆర్ఎస్ ఎన్నడూ ఎవరితో పొత్తులు పెట్టుకోలేదన్నారు. 2018లో బీజేపీయే తమతో పొత్తులు పెట్టుకోవాలనుకొందని కానీ తామే తిరస్కరించామని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటు చేస్తే తమ టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ సోనియాగాంధీకి హామీ ఇచ్చారు. సకుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళి ఆమెతో ఫోటో కూడా దిగారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇవ్వడమే కాకుండా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని విదంగా దెబ్బ తీసిన సంగతి అందరికీ తెలుసు.
మొదటిసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మోడీతో చాలా సఖ్యతగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో బిఆర్ఎస్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకొని ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవితకు కేంద్రమంత్రి పదవి ఇవ్వబోతున్నారనే వార్తలు వచ్చాయి. అంటే కేసీఆర్, మోడీలు అప్పుడే ఎన్డీఏలో చేరిక గురించి ఆలోచన చేసిన్నట్లు అర్దమవుతోంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలవడం నిజమే కనుక ఎన్డీఏలో చేరాలనుకోవడం కూడా నిజమే అయ్యుండవచ్చు. ఈవిషయంలో ప్రధాని మోడీకి అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మజ్లీస్, బిఆర్ఎస్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉంటూ కలిసే పనిచేస్తున్నాయి. ప్రతీ ఎన్నికలలో పరస్పరం సహకరించుకొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక ఏ పార్టీతో కలవలేదని కేటీఆర్ అనడం సరికాదు.
మునుగోడు ఉప ఎన్నికలలో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవడంతో అప్పటికప్పుడు వామపక్షాలతో కేసీఆర్ చేతులు కలిపి వాటి మద్దతుతో తమ అభ్యర్ధిని గెలిపించుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వాటిని పులిహోరలో కరివేపాకులా తీసి పక్కన పడేశారు. అది వేరే విషయం.
మోడీతో చెడిన తర్వాత కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకొని వివిద రాష్ట్రాలలో పర్యటించి కూటమి ఏర్పాటుకి ప్రయత్నించడం అందరికీ తెలుసు. కానీ ఎవరూ ఆయన నాయకత్వాన్ని అంగీకరించకపోవడంతో టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చుకొని ఒంటరిగా ముందుకు సాగుతున్నారు.
ఆ తర్వాత కర్ణాటకకు చెందిన జెడిఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి కుమారస్వామిని తన చుట్టూ తిప్పించుకొని హ్యాండిచ్చారు.
కనుక బిఆర్ఎస్ ఎవరితో చేతులు కలపలేదు… పొత్తులు పెట్టుకోలేదని చెప్పుకోవడం సరికాదు. కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ నేతలు ఈ విషయాలన్నీ మరిచిపోవచ్చునేమో కానీ ప్రజలు, మీడియా ఎప్పటికీ గుర్తుంచుకొనే ఉంటారని మరిచిపోకూడదు.



