మహారాష్ట్రపై కేసీఆర్‌ ఫోకస్ దేనికో?

KCR_BRS_Targets_Maharashtraబిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ఎంట్రీ ఇస్తున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌, ముందుగా తెలుగు రాష్ట్రమైన ఏపీలో పార్టీని విస్తరిస్తారనుకొంటే, తోట చంద్రశేఖర్‌ను రాష్ట్ర అధ్యక్షుడుగా నియామకంతో సరిపెట్టేసి మహారాష్ట్రపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే నాందేడ్‌లో తొలిసభను నిర్వహించిన కేసీఆర్‌, ఆదివారం కాందార్ లోహలో రెండో సభను నిర్వహించారు.

ADVERTISEMENT

మొదటిసభ అనుభవంతో రెండో సభను ఇంకా అట్టహాసంగా, విజయవంతంగా నిర్వహించారు. త్వరలోనే మిగిలిన జిల్లాలలో కూడా బిఆర్ఎస్‌ సభలు నిర్వహిస్తామని, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణలో తన ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, దళితబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ వంటివి మహా ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర రైతుల కోసం తాను మహా ప్రభుత్వంతో పోరాడుతానని కేసీఆర్‌ చెప్పారు.

దేశంలో 28 రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాలను, ఆర్ధిక వనరులను, ప్రజల అవసరాలను, స్థానిక సమస్యలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పధకాలు అమలుచేస్తుంటాయి. కనుక తెలంగాణలో అమలుచేసిన పధకాలను మహారాష్ట్రలో ఎందుకు అమలుచేయడం లేదని కేసీఆర్‌ ప్రశ్నించడం సరికాదు. సరైనదే అనుకొంటే, ఏపీలో అమలవుతున్న పధకాలను తెలంగాణలో ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించవచ్చు కదా?

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి మహారాష్ట్ర సరిహద్దులో 80 గ్రామాలు తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయని కేసీఆర్‌ నిన్న గర్వంగా చెప్పుకొన్నారు. ఏపీలో బిఆర్ఎస్‌ పార్టీని విస్తరించి, ఏపీకి కూడా అభివృద్ధి చేస్తామని కేసీఆర్‌ హామీ ఇస్తున్నప్పుడు, ఏపీని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయవచ్చు కదా?అని ఎవరైనా అంటే అది పెద్ద కుట్రే అని వాదిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.

ఆయన మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలనుకొంటే ఎవరూ తప్పు పట్టకూడదు. అదే తెలంగాణలో దశాబ్ధాలుగా ఉన్న టిడిపి ఏమాత్రం కాస్త యాక్టివ్ అయినా అది తెలంగాణను దోచుకోవడం కోసం చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తుంటారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపిలతో సహా ఏ పార్టీ అధికారం కోసం తమతో పోటీ పడకూడదని బిఆర్ఎస్‌ భావిస్తుంటుంది. కానీ బిఆర్ఎస్‌ మాత్రం అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని కోరుకొంటుంది.

ఇక తెలుగు రాష్ట్రమైన ఏపీలో కేసీఆర్‌ అడుగుపెట్టకపోవడానికి గల కారణాలు అందరికీ తెలిసినవే. ఏపీ, తెలంగాణలలో అధికారపార్టీల నేతల మద్య ఉన్న అవగాహనవల్ల కావచ్చు లేదా రెండు రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న వివాదాల వల్ల కావచ్చు లేదా గతంలో ఆంధ్రా పాలకులు, ప్రజల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల వలన కావచ్చు…. రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీ, టిడిపి, జనసేనలను చూసి కావచ్చు… కేసీఆర్‌ ఏపీలో అడుగుపెట్టడం లేదు. కానీ తెర వెనుక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కనుక ఏదో ఓ రోజు కేసీఆర్‌ ఏపీలో అడుగుపెట్టడం ఖాయం.

కేసీఆర్‌కు మొదటి నుంచి అండగా నిలబడినా వ్యక్తులలో కర్ణాటకకు చెందిన జెడిఎస్ అధినేత కుమార స్వామి కూడా ఒకరు. కనుక తొలుత కర్ణాటకలోనే జెడిఎస్‌తో కలిసి బిఆర్ఎస్‌ పోటీ చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. కానీ అప్పటి నుంచి కుమారస్వామి కేసీఆర్‌ని కలిసిందీ లేదు. బిఆర్ఎస్‌ సభలకు వచ్చిందీ లేదు. కేసీఆర్‌ కూడా కర్ణాటకలో సభలు నిర్వహించేబదులు మహారాష్ట్రలో నిర్వహించుకొంటున్నారు. సీట్ల పంపకాల విషయంలో ఇద్దరి మద్య తేడా కొట్టడంతో దూరమైన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏపీ, కర్ణాటకలో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కనుకనే కేసీఆర్‌ మహారాష్ట్ర పై దృష్టి పెట్టిన్నట్లున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉంది కనుక దానిని ఢీ అంటే ఢీ అని ఢీకొనేందుకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఢీకొని మరాఠీ ప్రజల నమ్మకం పొందగలిగితే, అక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు అల్లుకుపోవచ్చని కేసీఆర్‌ భావిస్తున్నారేమో?

ADVERTISEMENT
Latest Stories