తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అందరూ చూస్తూనే ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రేవంత్ ప్రభుత్వమూ బిఆర్ఎస్ పార్టీని అష్ట దిగ్బంధనం చేసి కేసీఆర్‌కు ఊపిరాడకుండా చేస్తున్నాయి.
ఈ పరిస్థితులలో కేసీఆర్ తన ఎదురుగా ఉన్న ఓ అవకాశాన్ని అందిపుచ్చుకొని మళ్ళీ పార్టీ శ్రేణులో ఉత్తేజం నింపి, రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్దమయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు నీళ్ళు అందించలేకపోతుండటంతో పలు జిల్లాలలో పంటలు ఎండిపోతున్నాయి. కళ్ళ ముందే ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.
కేసీఆర్ వారిని ఓదార్చేందుకు నేడు నాలుగు జిల్లాల పర్యటనకు బస్సులో బయలుదేరారు. అయితే కేసీఆర్ వారికేమీ నీళ్ళు తెచ్చి ఇచ్చి పంటలను కాపాడలేరని అందరికీ తెలుసు.
కానీ వారి కష్టాలకు సిఎం రేవంత్ రెడ్డి అసమర్ధత, రాజకీయాలే కారణమని చెపుతూ వారి ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై మళ్ళించేందుకే కేసీఆర్ తప్పక ప్రయత్నిస్తారు.
తద్వారా మే 13న జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో రైతులు కాంగ్రెస్ మీద ఆగ్రహంతో బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసేలా చేయాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు అర్దమవుతూనే ఉంది.
తెలంగాణ ఏర్పాటుకి మూడు ప్రధాన కారణాలలో నీళ్ళు కూడా ఒకటి. దాని కోసం సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి సాగునీటి సమస్య శాశ్వితంగా పరిష్కారం చేశానని చెప్పుకున్నారు. కేసీఆర్ తన పదేళ్ళ పాలనలో రైతులకు సాగునీటి కష్టాలు తీర్చారు. ఇది వాస్తవం కూడా.
కానీ ఆ ప్రాజెక్టులో మొట్ట మొదటిదైన ‘మేడిగడ్డ బ్యారేజి’లో మూడు పిల్లర్లు క్రుంగిపోవడం, దాంతో బ్యారేజి గోడలు దెబ్బ తిన్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం వాటినే హైలైట్ చేసి చూపిస్తూ కేసీఆర్ అవినీతి, అక్రమాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసి దోషిగా నిలబెట్టాలనుకుంది. నిలబెట్టింది కూడా.
కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డిని రైతుల ఎదుట దోషిగా నిలబెట్టేందుకు కేసీఆర్ బయలుదేరారు. కానీ వారిరువురి మద్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతుండటం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ, పంటలకు నీళ్ళు అందించకుండా కేసీఆర్‌కు తమ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కల్పించింది ఖచ్చితంగా రేవంత్ రెడ్డే అని చెప్పక తప్పదు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోయినా సహిస్తారేమో కానీ సాగు, త్రాగు నీరు, విద్యుత్ అందించకపోతే తెలంగాణ ప్రజలు క్షమించరని గ్రహిస్తే మంచిది. లేకుంటే లోక్‌సభ ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహాన్ని చవి చూడవలసి వస్తుంది.




