ఇదివరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమంటే మేమని కాంగ్రెస్, బీజేపిలు కీచులాడుకునేవి. రాష్ట్రంలో రెండో స్థానం కోసం పోటీలు పడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయ్యింది.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయమని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ మాట అన్నది వేరెవరో కాదు… తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తప్ప మరొకటి నిలబడలేదని ధీమా వ్యక్తం చేసిన కేసీఆరే.
తెలంగాణలో తనకు, తన పార్టీకి ప్రత్యామ్నాయం లేనే లేదని, తానే ప్రధాని మోడీకి ఏకైక ప్రత్యామ్నాయమని ఢంకా భజాయించి చెప్పుకున్న కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయమని చెప్పుకోవడం గొప్ప విషయం కానే కాదు. చాలా అవమానకరం.
గురువారం తన ఫామ్‌హౌసులో ముఖ్య నేతలతో సమావేశమైనప్పుడు, “ఈ కాంగ్రెస్ పాలనతో వేసారిపోయిన్న జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికలలో మనల్ని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారు. మనదే ఆలస్యం. ఈ ఉప ఎన్నికలో బీజేపి అడ్రస్ లేకుండా పోతుంది. మనం గెలిస్తే ఇక తిరుగులేదు,” అంటూ పార్టీ నేతలలో కేసీఆర్ ఉత్సాహం నింపారు.
ఒకప్పుడు కేసీఆర్ పేరు, ఫోటోతోనే ఎవరైనా అవలీలగా గెలిచేయవచ్చని గర్వంగా చెప్పుకునే వారు. కానీ ఈ ఉప ఎన్నికలో గెలిస్తే చాలన్నట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఈ ఉప ఎన్నికలో గెలిచినా కొత్తగా సాధించేది ఏమీ ఉండదు. మళ్ళీ పుంజుకుంటామనే నమ్మకం పార్టీ శ్రేణులలో కలుగుతుంది అంతే!
ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వలేకపోతోంది. కనుక కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్‌ని గెలిపించుకుంటే కి వేస్తే కనీసం ఎంతో కొంత అభివృద్ధి పనులు జరుగుతాయని భావించి ఆయనకే ఓట్లు వేసే అవకాశం ఉంది.
ఈ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కానీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఇక తిరుగే ఉండదని, పూర్వ వైభవం వస్తుందని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.







