శాసనసభ ఎన్నికలలో ఓటమి షాక్ నుంచి కేసీఆర్ పూర్తిగా తేరుకోక మునుపే, ఓ వైపు నుంచి రేవంత్ రెడ్డి, మరో వైపు నుంచి మోడీ బిఆర్ఎస్ పార్టీని దెబ్బ మీద దెబ్బ తీస్తూ నిర్వీర్యం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ఇదేవిదంగా కాంగ్రెస్, టిడిపిలను నిర్వీర్యం చేసినందున ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలను వేలెత్తి చూపలేకపోతున్నారు.
కానీ శక్తి కూడగట్టుకొని కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలకు సిద్దం అవుతుంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి ఢిల్లీ పట్టుకుపోవడంతో కేసీఆర్ కంగు తిన్నారు. పోనీ ఆమె అరెస్టుని చూపి సెంటిమెంట్ రాజేసి ఎన్నికలలో సానుభూతి ఓట్లు సంపాదించుకుందామని అనుకుంటే, పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధులు దొరకడం లేదు. అయినా ఏదోలా అభ్యర్ధులను ఖరారు చేసి ప్రకటిస్తే, కేసీఆర్‌కు మరో కొత్త కష్టం వచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూతురుతో పాటు అల్లుడు అనిల్ కుమార్‌కు కూడా ఈడీ నోటీస్ ఇచ్చింది. అంతటితో అయిపోలేదు. శనివారం ఉదయం ఈడీ అధికారులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన చెల్లెలు (కల్వకుంట్ల కవిత ఆదపడచు) అఖిల ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అనిల్ కుమార్ బంధువుల ఇళ్ళలో కూడా ఈడీ సోదాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ మీద ఒత్తిడి మరింత పెరిగిపోతుంది.
బిఆర్ఎస్ పార్టీలో కేసులు ఎదుర్కొంటున్న నేతలందరూ ఇంతకాలం కేసీఆర్ చక్రం అడ్డేసి తమను కాపాడుతారనే ధీమాతో ఉండేవారు. కానీ కేసీఆర్ తన కూతురినే కాపాడుకోలేకపోవడంతో అందరికీ కేసీఆర్ మీద భ్రమలు తొలగిపోతున్నాయి.
ఇప్పుడు కేసీఆర్ అల్లుడు బంధువుల ఇళ్ళలో కూడా ఈడీ సోదాలు చేస్తుండటంతో వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తీవ్ర భయాందోళలనకు గురవడం సహజమే. అప్పుడు వారందరూ కేసీఆర్ మీద ఒత్తిడి పెంచడం ఖాయమే.
కానీ కేసీఆర్ కూడా ఏమీ చేయలేని నిసహాస్థితిలో ఉన్నందున కేసులు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ నేతలు ఆత్మరక్షణ కోసం బీజేపీలో చేరిపోయేందుకు క్యూ కట్టవచ్చు. ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. ఇంకా చేరిపోతూనే ఉన్నారు.
శాసనసభ ఎన్నికలలో ఓడిపోగానే కేసీఆర్ బీజేపీతో రాజీకి ప్రయత్నించారు కానీ బీజేపీ అధిష్టానం పట్టించుకోలేదు. ఎందుకంటే దానికి ఇంకా పెద్ద లక్ష్యం ఉంది కనుక!
ఇప్పుడు కేసీఆర్ అల్లుడు అనిల్ కుమార్ బంధువుల వారి ఒత్తిళ్ళు భరించలేక కేసీఆర్ బీజేపీతో రాజీ కాదు పూర్తిగా లొంగిపోక తప్పేలా లేదు. అంటే లోక్‌సభ ఎన్నికలలో 17 ఎంపీ సీట్లు బీజేపీకి పళ్ళెంలో పెట్టి అందించాల్సి రావచ్చు.
అదే కనుక జరిగితే లోక్‌సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ చిన్నాభిన్నం అయిపోయినా ఆశ్చర్యం లేదు. మరోవిదంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌కు అన్ని మార్గాలు మూసివేసి అష్టదిగ్బందనం చేసి, బిఆర్ఎస్ పార్టీని స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చు.
మోడీని గద్దె దించుతానని, కాంగ్రెస్, బీజేపీలను బంగాళాఖాతంలో విసిరేస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ని ఇప్పుడు వాటి చేతుల్లో బందీగా మిగిలిపోవడం విచిత్రమే కదా?




