తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏమైందో ఏమో గానీ నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే ఆయన ఎందుకో చంద్రబాబు మీద చాలా కోపంగా ఉన్నారని అనిపించింది. వర్థమాన విషయాలే కాకుండా ఎప్పుడో జరిగిపోయిన వెన్నుపోటు ఉదంతం నుండి అన్నిటి గురించీ మాట్లాడారు కేసీఆర్. అయితే కేసీఆర్ చేసిన చాలా ఆరోపణలలో నిజం అనేది చాలా తక్కువగా ఉండడం గమనార్హం. అరచి చెబితే అబద్దం కూడా నిజం అవుతుందని అనుకుంటున్నారు ఆయన బహుశా.
[m9ad]
కూకట్‌పల్లిలో హరికృష్ణ కూతురు సుహాసినిని చంద్రబాబు పోటీకి పెట్టాడు. హరికృష్ణ మరణంతో శవ రాజకీయాలు చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆమెకు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు కేసీఆర్. సుహాసిని ఎన్నికలలో నిలబెట్టడం అనేది పూర్తిగా టీడీపీ ఎన్నికల అవసరం. సుహాసినికి న్యాయం చెయ్యలేదు అన్న కేసీఆర్ శ్రీకాంతాచారి తల్లికి ఇటీవలే ఎన్నికలలో ఎందుకు టిక్కెట్టు ఇవ్వలేదు? సుహాసినికి న్యాయం కోరే ముందు ఆయన చేసింది చెప్పాలి కదా? తెరాసకి ఉండే రాజకీయ అవసరాలు తెరాసకి ఉంటే, టీడీపీకి ఉండేవి టీడీపీకి ఉంటాయి.
హోదా వస్తే అవసరమే లేదని చంద్రబాబే అన్నారని, తాము ఏపీ హోదాకు ఎప్పుడూ అడ్డు పడలేదని కేసీఆర్ అన్నారు. అవసరమైతే ఈరోజే ఉత్తరం రాస్తాం ఇవ్వమని చెప్పారు. అయితే దేవరకద్ర ఎన్నికల సభలో సాక్షాత్తు కేసీఆర్ సోనియా గాంధీ మేడ్చల్ సభలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన ప్రకటనను తప్పు పట్టింది నిజం కాదా? అక్కడ హోదా ఇస్తే ఇక్కడి పరిశ్రమలు వెళ్ళి పోతాయని చెప్పలేదు. హరీష్ రావు పలుమార్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అంటే కేసీఆర్ ఎందుకు వారించలేదు?
ప్రత్యేక హోదాకు తెరాస పార్లమెంట్ లో మద్దతు ఇచ్చిన మాట నిజమే అయితే అదే సభలో మళ్ళీ వెనక్కు వెళ్ళిన మాట వాస్తవమే. తెలంగాణ పారిశ్రామిక పాలసీని ఏపీ కాపీ కొట్టారు అని ఆరోపించారు కేసీఆర్. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం కంప్లయింట్ చేసిన మాటా వాస్తవమే. మరి ఆ తరువాత కేంద్రం దాని మీద ఏం యాక్షన్ తీసుకుంది? ఆరోపణ వచ్చినా ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి ర్యాంకు ఆంధ్రప్రదేశ్ కే ఎలా ఇచ్చారు? కేంద్రం ఇస్తే ఆ విషయాన్ని కోర్టుకు ఎందుకు తీసుకుని వెళ్ళలేదు తెలంగాణ ప్రభుత్వం?
ఐటీలోనూ చంద్రబాబు పీకిందేమీలేదని అన్నారు అదంతా హైదరాబాద్ కు ఉన్న సహజమైన అనుకూలతల వల్ల, స్వర్గీయ రాజీవ్ గాంధీ, ఎన్ జనార్దన్ రెడ్డి వల్ల హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి జరిగిందని, అదంతా మేమే చేశాం అని సొంత పత్రికల ద్వారా బాకా ఊదుకున్నాడని ఆరోపించారు ఆయన. అసలు ఎన్ జనార్దన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రధానిగా రాజీవ్ గాంధీ లేరు. అయినా వివిధ వేదికలలో తెలంగాణాలో ఐటీ రంగంలో చంద్రబాబు కృష్ణిని కేటీఆర్ ఒప్పుకున్నారు.
2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ విషయంగా కేసీఆర్ బాబుని పొగిడిన వీడియోలు ఎన్నో. సైబర్ టవర్‌కు పునాది వేసింది చంద్రబాబు కాదు అన్నారు కేసీఆర్. ఇప్పుడు తెలంగాణాలో నడుస్తున్న ఎన్నో ప్రాజెక్టులు గతంలో కాంగ్రెస్ వారో టీడీపీ వారో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టినవే, అవి పూర్తయ్యాక క్రెడిట్ వారికే ఇస్తారా కేసీఆర్? ఎన్ జనార్దన్ రెడ్డి, రాజీవ్ గాంధీ బ్రతికుండి రాజకీయాలలో క్రియాశీలంగా ఉంటే వారికి క్రెడిట్ ఇచ్చే వారా కేసీఆర్? ఐటీ అంటే సైబర్ టవర్ కాదు… సైబర్ టవర్ వల్లే హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చెందలేదు.
ఏపీకి పదేళ్లపాటు లోటు బడ్జెట్ ఉంటుందని ఆ మేరకు రూ.24 వేల కోట్లను కేంద్రం ఏపీకి ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రం దీన్ని అమలు చేస్తోంది. మళ్లీ లోటు బడ్జెట్ ఎక్కడ ఉంది? ఇది వాస్తవం కాదా? ఆ డబ్బులు లేవా? అంతా అవినీతిమయం అని కేసీఆర్ ఆరోపించారు. ఇదంతా నిజమే అయితే అదే ఆర్థిక సంఘం లోటు బడ్జెట్ నిధులు ఇచ్చాక కూడా లోటు బడ్జెట్ లో ఉండే ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది వాస్తవం కాదా?
రాజకీయాలలో గెలిచిన వాడు ఏమైనా మాట్లాడొచ్చు ఓడిన వాడు గెలిచిన వాడు ఏం చెప్తే అది వినాలి. పైగా నోరు పెద్దగా ఉండే కేసీఆర్ లాంటి వారైతే ఏదైనా మాట్లాడతారు. అదే నిజమని నమ్మిస్తారు కూడా. దానికి బాకా ఊదడానికి వైకాపా, బీజేపీ, జనసేన వారు ఎలానో ఉన్నారు. అసలు నిజంగా స్వయంప్రకాశం లేని వారు ఎవరైనా ఉంటే వారు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీలు కేవలం చంద్రబాబును తిట్టడం కోసం ఎవరి చంక ఎక్కడానికైనా సిద్ధపడతారు కాబట్టి. ఇటువంటి వ్యాఖ్యలే చంద్రబాబు కేసీఆర్ మీద చేస్తే అక్కడి ప్రతిపక్షాలు కూడా సమర్ధించవు. అయితే ఆంధ్రప్రదేశ్ లో విషయం వేరు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత ఆత్మభిమానం, రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ పట్టవు ఇక్కడ పార్టీలకు.
– భరద్వాజ్ రేగడి, పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా
(నోట్: పాఠకుడి అభిప్రాయం. వివిధ రాజకీయ పరిణామాలపై పాఠకులు తమ భావాలు మిర్చి9కు పంపగలరు. ప్రచురణకు అర్హమైనవి ఏవైనా రాజకీయ కోణాలకు సంబంధం లేకుండా ప్రచురించబడును)



