ఒకప్పుడు భార్యను భర్త హత్య చేసే వార్తలే ఎక్కువగా మీడియాలో కనిపించేవి. కానీ ఇప్పుడు భర్తను భార్యలు హత్య చేస్తున్న వార్తలు కూడా కనిపిస్తున్నాయి.
తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగాఉన్నాడని నిజామాబాద్‌లో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్త నరాల్లోకి సిరంజ్ ద్వారా టాయిలెట్ క్లీనర్‌ను ఎక్కించి హత్య చేసింది.
ఆ ఘటన మరవక ముందే, కొద్ది రోజులవ్యవధిలో హైదరాబాద్ మియాపూర్‌లో మరో మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టి, భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే పోలీసులు చాలా సులువుగానే ఆ ఇద్దరు మహిళలను, హత్య చేయడానికి వారికి సహకరించిన వారి ప్రియులను అరెస్ట్ చేశారు.
ఇక్కడ చర్చ ఈ రెండు కేసులు,వాటి వివరాల గురించి కాదు. సమాజంలో వివాహేతర సంబంధాలకు కొందరుఎందుకు మొగ్గు చూపుతున్నారు? అలాంటి బంధమే బాగుందని అనుకున్నప్పుడు చట్టబద్ధంగా విడాకులుతీసుకునే అవకాశం ఉండగా, ఈ విధంగా హత్యలకు ఎందుకు పాల్పడుతున్నారు? ఇంత కిరాతకంగా హత్యలు ఎలా చేయగలుగుతున్నారు?
భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతన్నితొలగించుకోవాలనే ఆలోచనే ఒక తప్పు. అంతేకాదు,హత్య చేసిన తర్వాత పోలీసులను తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నించడం మరో నేరం. హత్య చేసినా పోలీసుల నుంచి తప్పించుకోగలమనిఅనుకోవడం ఆత్మవిశ్వాసమా? అవివేకమా?
భర్తని చంపేస్తే తాము సుఖంగా జీవించగలమనుకోవడం చూస్తుంటే మనుషుల ఆలోచనా విధానంలో ఊహించని మార్పులువస్తున్నాయని స్పష్టం చేస్తోంది.
ఒకప్పుడు అరుదుగా వినిపించిన ఇలాంటి ఘటనలు ఇప్పుడు తరచూ వెలుగులోకి వస్తుండటమే అసలు ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం చూస్తుంటే, మారుతున్నది కాలం మాత్రమే కాదు… మనుషుల ఆలోచనా విధానం కూడా అని నమ్మకతప్పదు.




