టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాజకీయాలలో నెగ్గుకు రావచ్చనుకుంటే, ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఆ పేరుతోనే సమస్య మొదలైంది. దానిపై 700 మందికి పైగా అభ్యంతరాలు వ్యక్తం చేసినందున, ఆ పేరు మార్చుకోవాలంటూ ఈసీ మొదటి షాక్ ఇచ్చింది.
దాంతో ఆమె ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయిస్తే అక్కడా ఆమెకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముందు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన నోటీసుకి సమాధానం ఇచ్చి, అక్కడ అమీతుమీ తెల్చుకున్నాకనే కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే ఇలాంటి విషయాలలో ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరించదు. వ్యవహరిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని బాగా తెలుసు. కనుక అన్ని కోణాలలో బాగా ఆలోచించే ఆమెకు ఈ సూచన చేసి ఉండవచ్చు. కనుక కవిత మళ్ళీ ఈసీ వద్దకు వెళ్ళినా బహుశః అదే సూచన చేయవచ్చు.
అప్పుడు ఆమె మళ్ళీ ఈసీని సవాలు చేస్తూ హైకోర్టుకి వెళ్ళక తప్పదు. కానీ ఎన్నికల సంఘం నిర్ణయం సహేతుకంగా ఉందని హైకోర్టు భావిస్తే మళ్ళీ అక్కడా కల్వకుంట్ల కవితకు మరోసారి ఎదురు దెబ్బ తప్పకపోవచ్చు. ఆ తర్వాత సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది.
ఈసీ నిర్ణయాల వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రభావం లేదా ఒత్తిళ్ళు ఉన్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు వ్యవహారంలో కూడా అలాంటి రాజకీయం ఉండి ఉంటే, టీఆర్ఎస్ పేరును కల్వకుంట్ల కవిత నిలబెట్టుకోవడం సాధ్యపడకపోవచ్చు.
ఇప్పటికే ఆమె తమ టీఆర్ఎస్ పేరు తస్కరించి వాడుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రజలలో కూడా ఆమె పట్ల అటువంటి దురాభిప్రాయమే ఏర్పడి ఉండవచ్చు.
కనుక ఈ కేసులో తుది తీర్పు ఎలా వచ్చినా, ఆమె చేస్తున్న ఈ న్యాయపోరాటాల గురించి మీడియాలో వచ్చే కథనాలు రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించవచ్చు. వాటి వలన ఆమెకు వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎంతోకొంత నష్టం కలిగించవచ్చు.
ఇప్పటికే తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ రాష్ట్ర సేనగా ఒకసారి, దాని నుంచి మళ్ళీ తెలంగాణ రక్షణ సేనగా పేర్లు, కండువాలు మార్చుకున్న కల్వకుంట్ల కవిత, ఇప్పుడు మరోసారి పేరు, కండువా మార్చుకుంటే నవ్వులపాలవుతారు.
అంతేకాదు.. రాజకీయాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న ఆమెకు ఈ పరిణామాలు శుభసూచకం కాకపోవచ్చు.
కానీ ఆమె ముందు న్యాయపోరాటాలు తప్ప మరో ఆప్షన్ లేదు. కష్టమైనా నష్టమైన చేయక తప్పదు. కానీ ఈ పోరాటాలను కూడా ఆడబిడ్డ పోరాటంగా అభివర్ణించుకోగల వాక్చాతుర్యం, దాంతో ప్రజల సానుభూతి పొందగల నేర్పు కల్వకుంట్ల కవితకు పుష్కలంగా ఉంది కూడా.




