ఒక్కోసారి కొన్ని పొరపాట్లు ఆయా రాజకీయ పార్టీల, వాటి నేతల జీవితాలనే మార్చేస్తుంటాయి. అందుకే అటువంటి పొరపాట్లను ‘చారిత్రిక తప్పిదాలు’గా అభివర్ణిస్తుంటారు.
ఇందుకు ఓ చక్కటి ఉదాహరణ కేసీఆర్ తన టిఆర్ఎస్ పార్టీ పేరుని బిఆర్ఎస్ పార్టీగా మార్చడం. తెలంగాణలో తిరుగేలేదనుకున్న బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోవడానికి అదీ ఓ ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.
Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!
ఏపీ విషయానికి వస్తే జగన్ లక్షల కోట్లు విలువైన అమరావతిని పాడుబెట్టేసి మూడు రాజధానుల పేరుతో 5 ఏళ్ళు కాలక్షేపం చేయడం, సరిగ్గా ఎన్నికలకు ముందు విశాఖలో ఋషికొండ మీద రూ.500 కోట్లతో తనకోసం విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం కూడా అటువంటి చారిత్రిక తప్పిదమే. వైసీపీ ఘోర పరాజయానికి ఈ చారిత్రిక తప్పిదం కూడా ప్రధాన కారణమే అని అందరికీ తెలుసు.
యూపీయే హయాంలోరాష్ట్ర విభజన చేస్తున్నప్పుడు ఏపీ.. ఏపీ కాంగ్రెస్ రెండూ నష్టపోయినా పరవాలేదు కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలనుకున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించింది.
Also Read – అక్కడ కవిత.. ఇక్కడ గుడివాడ సేమ్ టూ సేమ్!
కానీ ఏపీతో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. నేటికీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. అంటే రాజకీయకోణంలో ఆలోచిస్తూ రాష్ట్ర విభజన చేయడం చారిత్రిక తప్పిదమని నిరూపితమైంది.
తెలంగాణలో అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఎంతో శ్రమించి అధికారంలోకి తేగలిగారు. కనుక కాంగ్రెస్ పార్టీకి, ఆయనకు కూడా ఈ పదవి, అధికారం ఎంతో అమూల్యమైనవే. కనుక తెలిసి తెలిసి ఎవరూ అటువంటి చారిత్రిక తప్పిదాలు చేయరని భావించడం సహజం.
Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!
కానీ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో అటువంటి చారిత్రిక తప్పిదాలు చేస్తున్నారా?అని అనిపించక మానదు.
ఎందుకంటే కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రజలు ఊరూరా ఏర్పాటు చేసుకొని ఆరాధిస్తున్నారు. తెలంగాణ తల్లి విషయంలో రేవంత్ రెడ్డి ఆలోచనలు, అభిప్రాయాలు సహేతుకంగానే అనిపించవచ్చు. కానీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడున్న తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వికటిస్తే, ప్రజలు ఆమోదించకపోతే కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగవచ్చు.
తెలంగాణ తల్లి విగ్రహం మార్చాలని ప్రజలు కోరలేదు. కేసీఆర్ నిరంకుశ పాలన వద్దనుకొని రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కనుక వారి ఆకాంక్షలకే ఆయన తొలి ప్రాధాన్యం ఇచ్చి ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి తన సొంత ప్రాధాన్యతలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగిపోతున్నారు.
కనుక రేవంత్ రెడ్డి నిర్ణయాలు కూడా చారిత్రిక తప్పిదాలా కావా?అనే విషయం ఎన్నికలొస్తే తెలుస్తుంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి.
ఒకవేళ ప్రజలు అనుకూలంగా తీర్పు చెప్పిన్నట్లయితే రేవంత్ రెడ్డికి ఇక తిరుగు ఉండదు. కానీ తప్పని చెపితే ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఆయనకు ఇంకా మరో నాలుగేళ్ళ సమయం ఉంది. కానీ అందుకు ఆయన అహం పక్కన పెట్టాల్సి ఉంటుంది. లేకుంటే కాంగ్రెస్ అధిష్టానమే ఆయనని పక్కన పెట్టవచ్చు.