కేసీఆర్‌, జగన్‌ మార్గాలు వేరు కానీ ఎన్నికలే లక్ష్యం!

KCR - Jaganఏపీ, తెలంగాణ సిఎంలు జగన్‌, కేసీఆర్‌ ఇద్దరి ఆలోచనా విధానాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. కానీ ఇద్దరి లక్ష్యం మళ్ళీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడమే. అందుకు వారు ఎంచుకొన్న వేర్వేరు మార్గాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

ADVERTISEMENT

ముందుగా జగన్‌ గురించి చెప్పుకొంటే, ఆయన రాజమార్గమే ఎంచుకొన్నారు. అదే సంక్షేమ పధకాలు. అభివృద్ధితో ప్రజలందరినీ మెప్పించడం కంటే ఈపేరుతో ఓటర్లను మెప్పిస్తే సరిపోతుందని గట్టిగా నమ్మారు. దాని కోసమే అప్పులు చేస్తున్నారు. బటన్ నొక్కి పంచిపెడుతున్నారు. ఇప్పుడు వాటిని మళ్ళీ ఓట్ల రూపంలోకి మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే 2,000 నోట్లని మార్చుకొంటున్నట్లన్న మాట!

కేసీఆర్‌ సంక్షేమ పధకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా చేసి ప్రజలకు కళ్ళారా చూపించి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఇది బిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్రానికి, ప్రజలకు అందరికీ మేలు కలిగించేదని వేరే చెప్పక్కరలేదు.

అయితే ఇవికాక ప్రభుత్వోద్యోగాల భర్తీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, బదిలీలు, వేతన సవరణ, జీతాల పెంపు, సింగరేణి కార్మికుల డీఏ బకాయిలు, బోనసుల చెల్లింపు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, పంట రుణాల మాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ వంటి వాటిని కూడా కేసీఆర్‌ చాలా తెలివిగా ఎన్నికల వరకు సాగదీసి, బిఆర్ఎస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పరచుకొన్నారు.

గత 7-8 ఏళ్ళుగా ఉద్యోగాల భర్తీకి ప్రతిపక్షాలు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా లొంగకుండా, సుమారు ఏడాదిన్నర క్రితం దాదాపు 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామంటూ వరుసపెట్టి టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. అయితే నేటికీ ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తికాలేదు!

వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రక్రియ పూర్తవుతుందనే నమ్మకం లేదు. ఈ ఉద్యోగాలకు సుమారు 10-15 లక్షలమంది దరఖాస్తు చేసుకొన్నారు. కొందరు పరీక్షలు కూడా వ్రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వారు, వారి కుటుంబాలన్నీ బిఆర్ఎస్ పార్టీకే జై కొట్టకతప్పదు.

తెలంగాణ ప్రభుత్వం సుమారు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి చాలా కాలమే అయ్యింది. కానీ వాటిని పంపిణీ చేయకుండా జాప్యం చేస్తూ ఇప్పుడు ఎన్నికల గంట మ్రోగేముందు చకచకా పంచిపెడుతున్నారు. లక్ష కుటుంబాల ఓట్లు బిఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడిన్నట్లే కదా?

బిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాగానే 56 లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. కానీ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు చేసింది. అంటే మరో 56 లక్షల కుటుంబాల ఓట్లు బిఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడిన్నట్లే కదా?

ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు ఎద్దేవా చేసిన కేసీఆర్‌, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడేముందు విలీనం చేశారు. టిఎస్‌ఆర్టీసీలో 40 వేలమంది ఉద్యోగులున్నారు.

సింగరేణి కార్మికులకు సుమారు 2-3 ఏళ్ళుగా డీఏ బకాయిలు చెల్లించకుండా పెండింగులో పెట్టి ఇప్పుడు ఆ బకాయిలు, దసరా, దీపావళి బోనస్ వగైరాలు అన్నీ కలిపి ఒక్కో కార్మికుడికి సుమారు రూ.4-5 లక్షలు చేతిలో పెట్టారు. సింగరేణిలో మరో 40 వేల మంది కార్మికులున్నారు. సింగరేణి, టిఎస్‌ఆర్టీసీలో కలిపి 80వేల మంది, వారి బంధుమిత్రుల ఓట్లన్నీ బిఆర్ఎస్ పార్టీకే అని వేరే చెప్పక్కర లేదు.

ఏపీ సిఎం జగన్‌ రాష్ట్రం ఓడిపోయినా పర్వాలేదు తాను ఒక్కరే నెగ్గాలనుకొంటే, కేసీఆర్‌ నాతో పాటు నా పార్టీ, నా ప్రభుత్వం, నా రాష్ట్రం, నా ప్రజలు అందరూ నెగ్గాలనుకొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు తేడా ఇదే. ఏది బాగుంది?

ADVERTISEMENT
Latest Stories