తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కొత్త సంవత్సరం మొదటి రోజున సమీక్షించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎట్టిపరిస్థితుల్లోనూ జూన్‌లోగా పూర్తి చేసి.. ఖరీఫ్ సీజన్‌కు పంటలకు నీరందేలా చూడాలన్నారు. కోటి ఎకరాల మాగాణి కోసం భారీగా వ్యయం చేస్తున్నామని.. గడువులోగా నిర్మాణాలు పూర్తి చేసి సాగు, తాగు నీరు అందించాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. బ్యారేజీ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి మూడు నెలల వ్యవధిలో ఏ విధంగా పనులు జరిగాయో మ్యాపులు, చిత్రాల ద్వారా ఇంజినీరింగ్ అధికారులు వివరించారు.
[m9ad]
కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, సీఎంవో ఓఎస్డీ దేశ్‌పౌండే, ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ సుభాష్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. అయితే ఈ పర్యటన ఆసాంతం తాజా మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు సీఎంతో లేకపోవడం గమనార్హం. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు.
ఇటీవలే కాలంలో హరీష్ రావును నీటి పారుదల శాఖ నుండి తప్పించి ప్రశాంత్ రెడ్డి అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్న తరుణంలో ఆయన కేసీఆర్ వెంట ఉండడం గమనార్హం. గతంలో కేసీఆర్ నిర్వహించిన ప్రాజెక్టుల సమీక్షలో కూడా ఇదే చర్చ నడిచింది. హరీష్ లేకుండా ప్రశాంత్ రెడ్డితోనే ఆ సమావేశం నిర్వహించారు. హరీష్ ఈ మధ్య మీడియా కంట కూడా పడటం మానేశారు. ఇటీవలే తెరాస తిరిగి అధికారంలోకి వచ్చాకా హరీష్ రావు ప్రాధాన్యత అటు పార్టీలోనూ ఇటు తగ్గించే ప్రయత్నం జరుగుతుందని హరీష్ వర్గం ఆరోపిస్తుంది.
ఇప్పటికే కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెయ్యడంతో పార్టీలో నెంబర్ 2 ఎవరో కేసీఆర్ చెప్పేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా హరీష్ ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం జరుగుతుందా? ఆయనను మొత్తానికి కేబినెట్ నుండి తప్పించి లోక్ సభకు పంపే అవకాశం ఉందని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. మరో వైపు కేసీఆర్ మనసులో ఏముందో ఎవరికీ తెలియడం లేదు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపుగా నెల రోజులు కావొస్తున్నా ఇప్పటికీ కేబినెట్ విస్తరణ జరగలేదు.



