కల్వకుంట్ల @440….లెక్క సరితూగుతుందా.?

Revanth Reddy KCR Land Claims Assembly

తెలంగాణ రాజకీయాలలో అసెంబ్లీ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయనే చెప్పాలి. ఈ నెల 7 వ తేదీన బిఆర్ఎస్ నేతల నల్ల చొక్కాల నరసనతో మొదలైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కల్వకుంట్ల బ్రాండ్ కి భూకబ్జా మరకలు అంటే వరకు వెళ్లాయి.

నేడు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన ప్రకటనలు ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న భూముల లెక్కల పై చూపిన రికార్డులు తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో సంచలనంగా మారాయి.

ADVERTISEMENT

పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధరణి పేరుతో వందల ఎకరాలు స్వాహా చేసారని, కేసీఆర్ ఫామ్ హౌస్ పై విచారణ జరిపి 30 రోజులలో నివేదిక సమర్పించాలంటూ అధికారులను ఆదేశించారు.

ఒక్క అధికారిక రికార్డు ల ప్రకారమే కేసీఆర్ తో సహా ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద హైద్రాబాద్ శివారు మొదలుకుని మొత్తం 9 జిల్లాలలో 440 ఎకరాల భూమి ఉందని, ఒక ఉద్యమకారుడిగా చెప్పుకునే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన దశాబ్దకాలంలోనే ఇన్ని వందల ఎకరాల భూమిని ఎలా సంపాదించారంటూ రేవంత్ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

ఇందులో ఒక్క కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరు మీదే 123.19 ఎకరాల భూమి ఉందంటూ మొత్తం లెక్కల ఆధారంగా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చేసిన ప్రకటనలు బిఆర్ఎస్ లో భూ ప్రకంపనలు తెచ్చేలా కనిపిస్తున్నాయి. అలాగే కేసీఆర్ మేనల్లుడు హారిష్ రావు పేరు మీద 30 ఎకరాలు, కుమార్తె కవిత పేరు మీద 35 ఎకరాలు, కేసీఆర్ బంధువు సంతోష్ రావు పేరిట 79 ఎకరాల భూమి ఉన్నట్టు అధికారిక లెక్కలను చూపించారు రేవంత్.

కేసీఆర్ భూ దందాలా పై విచారణ జరిపి కేసీఆర్ అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న భూములలో నింబంధలకు వ్యతిరేకంగా ఉన్న ఒక్క కుంట భూమి ని కూడా ఉపేక్షించకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదప్రజలకు పంచి పెడతామన్నారు రేవంత్.

కల్వకుంట్ల @440 అన్నట్టుగా సాగిన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు కేవలం రాజకీయ ఆరోపణలుగా మిగిలిపోతాయా.? లేదా ఆ కంచె దాటి ముందుకెళతాయా.? ఇప్పటికే కాళేశ్వరంలో కేసీఆర్, హరీష్ అవినీతి అంటూ అధికార కాంగ్రెస్ కేవలం ఆరోపణలకే పరిమితం అయ్యింది కానీ చర్యలకు ముందుకు రాలేకపోతుంది.

ఇక ఇప్పుడు రేవంత్ చేసిన ఈ ప్రకటనలు కూడా వాటి తరహాలోనే కొన్ని రోజులు అధికార – విపక్షాల మధ్య మాటల యుద్దానికి, రాజకీయ కాలక్షేపానికి పరిమితం అవుతాయా.? లేదా అనేది చూడాలి..!

ADVERTISEMENT
Latest Stories