తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ మళ్ళీ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. తన ఫామ్‌హౌస్‌లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలలో మనం 9-12 సీట్లు గెలుచుకోబోతున్నాము. మొత్తం 17 స్థానాలలో 12-14 స్థానాలలో మనమే కాంగ్రెస్, బీజేపీకి గట్టి పోటీ ఈయబోతున్నాము.
ఈ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ కనుమరుగు అవుతుంది. బీజేపీకి బహుశః ఇవే చివరిసారి కావచ్చు. దేశంలో ప్రాంతీయ పార్టీలే జాతీయ రాజకీయాలను శాశిస్తాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కూల్చక్కర లేదు. దానంతట అదే కూలిపోతుంది.
కాంగ్రెస్, బీజేపీలకు సొంత బలం, బలమైన అభ్యర్ధులు లేరు కనుకనే మన పార్టీ నుంచి నేతలను పట్టుకుపోతున్నాయి. అటువంటి అవకాశవాద నేతలు ఉన్నా లేకపోయిన ఒకటే. పార్టీ జెండాని మోసేవారే మనకు ముఖ్యం.
కల్వకుంట్ల కవితపై పెట్టిన అక్రమకేసులపై న్యాయపోరాటం చేస్తూనే రాష్ట్రంలో కూడా ప్రజాపోరాటాలు చేసి అన్యాయాన్ని ఎదుర్కొందాము,” అని కేసీఆర్ మాటల సారాంశం.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ బలహీనపడిన మాట వాస్తవమే అందువల్లే బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. కానీ అదే కాంగ్రెస్ చేతిలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా?
ఇప్పుడు మోడీని కాదని దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ మనుగడ సాగించలేని పరిస్థితిలో ఉంది. నితీష్ కుమార్, అర్వింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, శరత్ పవార్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్ తదితరుల పరిస్థితి చూస్తే ఇది అర్దమవుతుంది. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ మోడీని ఎదిరించలేక ఓ పక్క ‘సరెండర్’ అయిపోతుంటే, కూతురు కోసం సరేండర్ అయిపోవడానికి సిద్దంగా ఉన్న కేసీఆర్ ఇంకా ఈవిదంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
గతంలో తాను కాంగ్రెస్, టిడిపి నేతలు, ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని వాటిని నిర్వీర్యం చేసినప్పుడు కేసీఆర్‌కు తప్పుగా అనిపించలేదు. కానీ ఇప్పుడు అదేపని కాంగ్రెస్, బీజేపీలు చేస్తుంటే వాటికి బలం లేదు… అభ్యర్ధులు లేరు… అంటూ కేసీఆర్ మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది.
వాటికి బలం లేదనుకుంటే వాటిని చూసి కేసీఆర్ ఎందుకు9 భయపడుతున్నారు? శాసనసభకు వచ్చి మమ్మల్ని ఎదుర్కోవాలని సిఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరిన ఎందుకు వెళ్ళలేదు?కూతురు కల్వకుంట్ల కవితని కళ్లెదుటే ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు చక్రం తిప్పి అడ్డుకోలేకపోయారు. కనీసం నోరు విప్పి ఆమె అరెస్టుని ఖండించలేకపోయారు…. ఎందుకు? అని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కానీ కేసీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారు.
కేసీఆర్ కళ్లెదుటే బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతున్నా, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీలో అందరూ వెనకంజ వేస్తుంటే, కేసీఆర్ తన పార్టీ పరిస్థితి గురించి దిగులు పడే బదులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందంటూ పగటి కలలు కంటుండటం, తాను కళ్ళకు గంతలు కట్టుకొని పార్టీ నేతలకు కూడా కట్టాలనుకోవడం చాలా ఆశ్చర్యం చాలా కలిగిస్తుంది కదా?




