తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి మిగిలి ఉన్న ఇంతో అంతో నాయకులను కూడా వదిలిపెట్టేలా లేరు. ఆయన కాసేపటి క్రితం టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటి వరకు వలస నేతలతో టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ భేటీ అయి… వారిని పార్టీలోకి ఆహ్వానించేవారు. అయితే ఈ సారి మాత్రం కేసీఆరే రంగంలోకి దిగారు. నిజామాబాదులో మండవ టీడీపీకి చాలా కాలంగా పెద్దదిక్కుగా ఉన్నారు.
ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం ప్రభ తగ్గిపోయాక రాజకీయంగా ఆయన యాక్టీవ్ గా లేరు. తెరాస అనేకసార్లు ప్రలోభ పెట్టినా టీడీపీని వీడలేదు. నిజామాబాద్‌లో రైతులు ఎంపీ కవితకు వ్యతిరేకంగా భారీగా నామినేషన్లు వేసిన నేపథ్యంలో కూతురి కోసం వెంకటేశ్వరరావును కేసీఆర్ కలిశారనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో వెంకటేశ్వరరావుకు రైతులతో మంచి సంబంధాలున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అత్యధికంగా రైతులు నామినేషన్ దాఖలు చేశారు.
అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురిచేసినా రైతులు నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీనితో వారిని శాంతపరించేందుకు కేసీఆర్ మండవను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు కాస్త మెత్తబడితే మరోసారి కవిత బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ తరపున సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్, బీజేపీ తరపున మాజీ మంత్రి డి శ్రీనివాస్ తనయుడు అరవింద్ బరిలో ఉన్నారు. భారీ ఎత్తున రైతులు నామినేషన్లు వెయ్యడంతో మొత్తంగా 185 మంది నిజామాబాదు పార్లమెంట్ బరిలో ఉన్నారు.



