కేసీఆర్‌కు ఇక రోజూ అగ్నిపరీక్షలు తప్పవా?

kcr munugode by electionsఅపర చాణక్యుడని పేరు పొందిన తెలంగాణ సిఎం కేసీఆర్‌ను బిజెపి, కేంద్ర ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతుండటం విశేషం. తెలంగాణలో టిఆర్ఎస్‌కు తిరుగేలేదనుకొన్న కేసీఆర్‌కు హుజురాబాద్‌ ఉపఎన్నికతో గట్టి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్రాన్ని తెలంగాణ ప్రజలు, రైతుల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తే ధాన్యం తీసుకోకుండా మరో పెద్ద షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వద్ద పెరుకుపోయిన ఆ లక్షల టన్నుల ధాన్యాన్ని ఏమి చేసుకోవాలో తెలీని పరిస్థితి నెలకొంది.

సిఎం కేసీఆర్‌ నిత్యం ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, మోడీని గద్దె దింపుతానని శపధాలు చేస్తూ కూటమి, జాతీయ పార్టీ అంటూ హడావుడి చేస్తుండటంతో కేంద్రం ఆర్ధిక ఆంక్షలు విధించి ఆయన చేతులు కట్టేసింది. సిఎం జగన్మోహన్ రెడ్డి అడిగిందే తడువుగా అప్పులు ఇప్పించే మోడీ ప్రభుత్వం, కేసీఆర్‌ ఢిల్లీలో వారం రోజులు మకాం వేసిన అప్పు పుట్టకుండా చేసి తిప్పి పంపించింది.

ADVERTISEMENT

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ వస్తే మొహం చాటేస్తునందుకు సిఎం కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చినా ఈసారి ఎవరూ అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అపాయింట్మెంట్ లభించింది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లభించలేదు!

ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికతో సిఎం కేసీఆర్‌కు మరో అగ్నిపరీక్ష పెట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకొనే ముందు ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించడం ద్వారా తమ ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేయాలని, అస్థిరపరచాలని మోడీ, అమిత్ షాలు పెద్ద కుట్ర పన్నారని, ఇదొక రాజకీయ ఎత్తుగడ అని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం.

టిఆర్ఎస్‌ పార్టీకి ఎన్నికలంటే ఒకప్పుడు ఓ ఆటగా ఉండేది. ఎన్నికలనగానే చాలా ఉత్సాహం ప్రదర్శిస్తుండేది. కానీ తొలిసారిగా మునుగోడు ఉపఎన్నికల విషయంలో మౌనం వహిస్తోంది! ఇది బిజెపి రాజకీయ ఎత్తుగడ అని టిఆర్ఎస్‌ గ్రహించింది కనుక ఈ ఉచ్చులో చిక్కుకోకుండా ఏవిదంగా బయటపడాలని మల్లగుల్లాలు పడుతోంది.

హుజురాబాద్‌లో ఘోర పరాజయం తర్వాత జరుగబోతున్న ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. కనుక ఉపఎన్నికలకు బదులు ఏకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సిఎం కేసీఆర్‌ ముందస్తుకు వెళితే ఆయనకు ఆ పరిస్థితి కల్పించినందుకు బిజెపియే పైచేయి సాధించినట్లవుతుంది.

ఒకవేళ ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ గెలిచినా బిజెపి మళ్ళీ మరొకరి చేత రాజీనామా చేయించి వెంటనే మరో ఉపఎన్నిక తీసుకురాకుండా ఉండదు. కనుక మునుగోడు ఉపఎన్నికలు టిఆర్ఎస్‌కు ముఖ్యంగా సిఎం కేసీఆర్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు మారాయని భావించవచ్చు.

సిఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి చూపారనేది నూటికి నూరు శాతం నిజం. కానీ తన బలాన్ని, శక్తిసామర్ధ్యాలను అతిగా ఊహించుకొనందునే చేజేతులా సమస్యలు కొనితెచ్చుకొని ఇప్పుడు బాధలు పడుతున్నారని చెప్పక తప్పదు.

ఇదివరకు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే మోడీని ఢీకొని సమస్యలు కొనితెచ్చుకొన్నారని తెలిసి ఉన్నా సిఎం కేసీఆర్‌ కూడా నేటికీ అదే బాటలో ప్రయాణిస్తున్నారు. కనుక వచ్చే ఎన్నికల వరకు ఆయన ప్రభుత్వానికి రోజూ ఇటువంటి అగ్నిపరీక్షలు తప్పకపోవచ్చు. ఇది కేసీఆర్‌ స్వయంకృతాపరాదమే కనుక ఆయన బిజెపిని దాని వెనుకున్న కేంద్ర ప్రభుత్వాని ఏదోవిదంగా ఎదుర్కోక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories