సొంత పార్టీలను విడిచి గులాబీ గూట్లో చేరిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఊపిరి సలపడం లేదు. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పట్ల ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నా ఏ కారణాల చేతనో పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోందంటు సర్వేల పేరుతో కేసీఆర్ మీడియాకు లీకులు ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నిఘా విభాగాల ద్వారా చేయించిన సర్వేలలో ఇది ఉందంటూ అధికారపార్టీ ఊదరగొడుతుంది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా వంకలు పెట్టి ఏదోవిధంగా టిక్కెట్ ఎగ్గొట్టే ప్రయత్నం అని వారు అనుమానిస్తున్నారు. అనవసరంగా పార్టీ మారం రా దేవుడా అని వారు భావిస్తున్నారంట.
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 63 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రాజకీయ పునరేకీకరణల పేర జరిగిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో ప్రస్తుతం టీఆర్‌ఎస్ బలం ఏకంగా 88కి పెరిగింది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐలకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు.
అయితే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాదని భావించి ఫిరాయింపులు ప్రోత్సహిస్తే ఇప్పుడు అది జరిగే అవకాశం లేకపోవడంతో టిక్కెట్ల కేటాయింపు అనేది క్లిష్టంగా మారింది. ఇప్పుడు ఏదో వంక చెప్పి వారిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారి అనుమానం



