కేసీఆర్‌, కేటీఆర్‌ మళ్ళీ మొదలెట్టేశారుగా

KCR-KTR

శాసనసభ ఎన్నికలలో ఓటమి, తుంటి ఎముక విరిగి మంచాన్న పడటం, పార్టీ నేతల వలసలు, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్‌ కేసులు, తిహార్ జైల్లో పురాణాలు చదువుకొంటున్న కల్వకుంట్ల కవిత… ఈ పరిణామాలన్నీ కేసీఆర్‌ జీర్ణించుకోవడం, తట్టుకోవడం కష్టమే.

ఆయన నమ్మిన వాస్తు, జాతకాలు, చేసిన యాగాలు ఏవీ ఆయనను ఈ కష్టాల నుంచి కాపాడటం లేదు. ఒకేసారి ఇన్ని సమస్యలు చుట్టుముట్టడంతో కేసీఆర్‌ శాసనసభ సమావేశాలకు కూడా వెళ్ళలేకపోయారు. కనీసం మీడియా సమావేశాలు కూడా నిర్వహించలేకపోయారు.

ADVERTISEMENT

కానీ మూలిగే నక్కపై తాటిపండు పడిన్నట్లు ఇప్పుడు ఆయన వద్దనుకున్నా లోక్‌సభ ఎన్నికలు వచ్చి నెత్తిన పడటంతో తన పరువు, పార్టీని కాపాడుకోవడం కోసం ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాక తప్పడం లేదు.

కానీ ఇంత జరిగినా ఆయన అహంభావం, నోటి దురుసుతనం, ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయం ఏమాత్రం తగ్గకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః తన ఈ అవలక్షణాలే బిఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని ఆయన గట్టిగా నమ్ముతున్నట్లున్నారేమో?యధారాజా తధాప్రజా అన్నట్లు అందుకే కేటిఆర్‌ కూడా మళ్ళీ ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు మొదలుపెట్టిన్నట్లున్నారు.

గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడబోతోంది. ఎన్నికల తర్వాత రేవంత్‌ రెడ్డి బీజేపీలో చేరిపోవచ్చు లేదా బీజేపీ ఆయన ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చు.

ఆనాడు 116 సీట్లతో చాలా బలంగా ఉన్న మన ప్రభుత్వాన్నే కూల్చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇప్పుడు కేవలం 65 మంది ఎమ్మెల్యేలతో అధికారంలో ఉన్న రేవంత్‌ ప్రభుత్వాన్ని కూల్చేయకుండా ఉంటుందా?

ఇప్పుడు నేను ఓకే అంటే 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తీసుకువస్తానని మన పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు నాతో అన్నారు. కానీ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎలాగూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతే అప్పుడు ఎలాగూ వాళ్ళే మన దగ్గరకే వస్తారు కదా… అందుకే ఇప్పుడే వద్దని చెప్పాను.

రాబోయే రోజుల్లో మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాము. ఇంత కాలం నేను ప్రజాస్వామ్యానికి కట్టుబడి మౌనంగా ఉండిపోతే రేవంత్‌ రెడ్డి చాలా రెచ్చిపోతున్నాడు. ఇక ముందు తెలంగాణ ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ని అందరూ చూడబోతున్నారు,” అని కేసీఆర్‌ అన్నారు.

రేవంత్‌ ప్రభుత్వానికి బీజేపీ నుంచి గండం ఉందనే కేసీఆర్‌ వాదనలో నిజం ఉంది. కానీ రేవంత్‌ బీజేపీలో చేరిపోతారని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తన వద్దకు వస్తే వారితో కలిసి తాను ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని కేసీఆర్‌ మాట్లాడటం ఆయన స్థాయికి తగని మాటలే. ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేదని స్పష్టం చేస్తున్నాయి.

అదే… హరీష్ రావు లేదా కేటీఆర్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరుతారని ఎవరైనా అంటే కేసీఆర్‌ సహించగలరా? రేపు నిజంగా అదే జరిగితే కేసీఆర్‌ తలెత్తుకొని తిరగ గలరా?

తన ప్రభుత్వాన్ని ఎవరైనా కూలుస్తారేమో అనే భయం లేదా కుంటి సాకుతోనే తెలంగాణలో కాంగ్రెస్‌, టిడిపి నేతలను ఫిరాయింపజేసుకొన్న కేసీఆర్‌, నేడు అధికారంలో లేకపోయినా ఇంకా అదే విదంగా ఆలోచిస్తున్నారు… మాట్లాడుతున్నారు.

ఇటువంటి దురాలోచనలు చేస్తూ కూడా నీతి కబుర్లు చెపుతుండటం, కాంగ్రెస్‌, బీజేపీలను చివరికి చంద్రబాబు నాయుడుని కూడా ఇంకా నిందిస్తుండటం ఆయన అహంభావానికి, పదవీ లాలసకు అద్దం పడుతోంది.

ఈ అహంభావమే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయేలా చేసింది. ఈ అహంభావమే బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా తుడిచి పెట్టుకుపోయేలా చేసినా ఆశ్చర్యం లేదు. బిఆర్ఎస్ ఓడినా, పార్టీ తుడిచిపెట్టుకుపోతున్నా నా (ఇగో) అహంభావమే నాకు ముఖ్యం అనుకుంటే ఇక బిఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరు.

ADVERTISEMENT
Latest Stories